LOADING...
Bangladesh: ఇంధన సంక్షోభంలో బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతు.. 5 వేల టన్నుల డీజిల్ సరఫరా
ఇంధన సంక్షోభంలో బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతు.. 5 వేల టన్నుల డీజిల్ సరఫరా

Bangladesh: ఇంధన సంక్షోభంలో బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతు.. 5 వేల టన్నుల డీజిల్ సరఫరా

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 11, 2026
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన సరఫరాల్లో అంతరాయం ఏర్పడి డీజిల్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌కు భారత్ సాయం అందించింది. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతున్న నేపథ్యంలో భారత్ నుంచి 5,000 టన్నుల డీజిల్‌ను బంగ్లాదేశ్‌కు పంపింది. ఇది రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సాధారణ ఇంధన వాణిజ్య ఒప్పందం భాగంగానే పంపిన సరఫరా అని వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ యుద్ధం తర్వాత చమురు సరఫరాలు అంతరాయం కావడంతో బంగ్లాదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా పెరిగింది. భారత్ నుంచి వచ్చిన డీజిల్ సరఫరాను ఢాకా ధృవీకరించడంతో పాటు మరిన్ని సరఫరాలు అందించాలని కోరింది.

వివరాలు 

ప్రస్తుత సరఫరా 5,000 టన్నులే

ఈ విషయంపై బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ) చైర్మన్ మహ్మద్ రెజానూర్ రహ్మాన్ మాట్లాడుతూ... భారత్‌తో ఉన్న ఒప్పందం ప్రకారం ప్రతి ఏడాది పైప్‌లైన్ ద్వారా 1,80,000 టన్నుల డీజిల్ బంగ్లాదేశ్‌కు సరఫరా చేయాలని నిర్ణయమైందన్నారు. ప్రస్తుతం వస్తున్న 5,000 టన్నుల డీజిల్ కూడా అదే ఒప్పందంలో భాగమని ఆయన మంగళవారం వార్తా సంస్థ ANIకి తెలిపారు. అదే ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో కనీసం 90,000 టన్నుల డీజిల్ బంగ్లాదేశ్ దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం వచ్చిన సరఫరా 5,000 టన్నులేనని, వచ్చే రెండు నెలల్లో ఆరు నెలల అవసరానికి సరిపడే మొత్తం డీజిల్‌ను దిగుమతి చేసుకునేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

వివరాలు 

బంగ్లాదేశ్ అభ్యర్థనపై భారత్ స్పందన

'ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్' ప్రాజెక్ట్ కింద భారత్ బంగ్లాదేశ్‌కు డీజిల్ సరఫరా చేస్తోంది. 2017లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ద్వారా అసోంలోని నుమాలిగఢ్ రిఫైనరీ నుంచి వాణిజ్య ప్రాతిపదికన ఇంధనం సరఫరా అవుతోంది అని వర్గాలు వెల్లడించాయి. అయితే బంగ్లాదేశ్ కోరిన అదనపు డీజిల్ సరఫరాల విషయంలో ఇంధన లభ్యత, మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి పెరిగినప్పటికీ భారత్‌లో మాత్రం ఇంధన కొరత లేదని న్యూ ఢిల్లీ ఇప్పటికే స్పష్టం చేసింది.

Advertisement

వివరాలు 

ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం పలు కఠిన నిర్ణయాలు

వాణిజ్య ఒప్పందం ప్రకారం భారత్ ప్రతి ఏడాది 1,80,000 టన్నుల డీజిల్‌ను బంగ్లాదేశ్‌కు సరఫరా చేయాల్సి ఉంది. అయితే అసోంలోని నుమాలిగఢ్ రిఫైనరీ నుంచి అదనంగా మరో 5,000 టన్నుల డీజిల్ ఇవ్వాలన్న బీపీసీ అభ్యర్థనపై ఇప్పటివరకు భారత్ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా తీవ్రమవుతున్న ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. సోమవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను తాత్కాలికంగా మూసివేసింది. అదే సమయంలో ఇంధన సరఫరాలు తగ్గిపోతున్న నేపథ్యంలో గత వారం పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరగడంతో పరిస్థితిని అదుపులో పెట్టేందుకు రోజువారీ ఇంధన విక్రయాలపై కూడా కఠిన పరిమితులు విధించింది.

Advertisement

వివరాలు 

ఇరాన్ యుద్ధం.. ఇంధన సంక్షోభానికి దారితీస్తోంది

ఇదే సమయంలో ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. మంగళవారం అమెరికా సైన్యం ఇరాన్‌కు చెందిన డజన్లకు పైగా మైన్లు వేయగల నౌకలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. దీనిపై స్పందించిన ఇరాన్..ప్రాంతం నుంచి చమురు ఎగుమతులను అడ్డుకుంటామని హెచ్చరించింది. తమ శత్రువులకు"ఒక్క లీటర్ చమురు కూడా" వెళ్లనివ్వమని స్పష్టం చేసింది.ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా సైన్యం 16మైన్‌లేయర్స్ ధ్వంసం చేసినట్లు తెలిపింది. అయితే హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ పేలుడు పదార్థాలు అమర్చిందని నిర్ధారణ కాలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

వివరాలు 

యుద్ధం 11వ రోజుకు..

ఇరాన్ ఆ మార్గంలో మైన్లు అమర్చితే వెంటనే తొలగించకపోతే ఇప్పటివరకు చూడని స్థాయిలో దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించినట్లు అమెరికా వర్గాలు తెలిపాయి. యుద్ధం 11వ రోజుకు చేరుకోవడంతో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కూడా మరింత తీవ్రమైంది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఇప్పటివరకు లేనంత తీవ్ర దాడులు చేస్తామని ప్రకటించగా, మరోవైపు అమెరికా సైనికులకు గాయాలు అయిన వివరాలను పెంటగాన్ వెల్లడించింది. ఈ ఘర్షణ ప్రభావం మధ్యప్రాచ్య దేశాలపై మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. ఇరాన్ నాయకత్వం చర్చలకు సిద్ధం కాదని ప్రకటిస్తూ ట్రంప్‌పై విమర్శలు గుప్పించింది. అదే సమయంలో ఇజ్రాయెల్,గల్ఫ్ అరబ్ దేశాలపై కొత్త దాడులు కూడా ప్రారంభించింది.

Advertisement