Lok Sabha: కేంద్ర సర్వీసుల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్ అమలు: లోక్‌సభలో కేంద్రం వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సివిల్ పోస్టులు, సేవలకు జరిగే ప్రత్యక్ష నియామకాల్లో ఓబీసీ (ఇతర వెనుకబడిన వర్గాలు) అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్ అమలులో ఉందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభకు వెల్లడించింది. ఈ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి బి.ఎల్. వర్మ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, 1993 సెప్టెంబరు 8న డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) జారీ చేసిన కార్యాలయ ఉత్తర్వు, అనంతరం విడుదలైన మార్గదర్శకాల ఆధారంగా కేంద్ర సివిల్ పోస్టులు, సేవల ప్రత్యక్ష నియామకాల్లో ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్ కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు.
వివరాలు
ఓబీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు,ఫెలోషిప్‌లు: కేంద్రం వివరాలు
ఓబీసీ వర్గాల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. పీఎం-యశస్వి పథకం కింద ప్రీ-మెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఉన్నత విద్యకు అవకాశాలు పెంచడం, వసతిగృహాల నిర్మాణం వంటి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అలాగే ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు జాతీయ ఫెలోషిప్‌లు అందిస్తున్నామని, విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీ ఇవ్వడానికి డాక్టర్ అంబేడ్కర్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అమలులో ఉందని మంత్రి తెలిపారు.