P-8I Aircraft: డిఆర్'డిఓ-భారత నౌకాదళం కీలక పరీక్షలు విజయవంతం.. పీ-8ఐ విమానం నుంచి ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ ట్రయల్స్ సక్సెస్
ఈ వార్తాకథనం ఏంటి
గోవా తీర ప్రాంతం వద్ద దేశీయంగా తయారైన ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్‌ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO),భారత నౌకాదళం కలిసి విజయవంతంగా పరీక్షించాయి. పీ-8ఐ విమానం నుంచి ADC-150 అనే ఈ కంటైనర్‌ను గాల్లో నుంచి విడుదల చేసే నాలుగు ఇన్-ఫ్లైట్ ట్రయల్స్ విజయవంతంగా నిర్వహించారు. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 1, 2026 వరకు ఈ పరీక్షలు వివిధ కఠిన పరిస్థితుల్లో నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. 150 కిలోల వరకు సామాగ్రిని తీసుకెళ్లే విధంగా రూపొందించిన ఈ ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ ద్వారా సముద్రంలో విధులు నిర్వహిస్తున్న నౌకలకు అత్యవసర సమయంలో త్వరగా సహాయం అందించేందుకు వీలు కలుగుతుంది.
వివరాలు
DRDO అభివృద్ధి చేసిన ADC-150 ట్రయల్స్ విజయవంతం
ముఖ్యంగా తీరానికి దూరంగా బ్లూ సీలో ఉన్న నౌకలకు అవసరమైన కీలక సామగ్రి, పరికరాలు, వైద్య సహాయం వంటి వాటిని వెంటనే పంపించేందుకు ఇది ఉపయోగపడనుంది. దీంతో నౌకాదళ ఆపరేషనల్ లాజిస్టిక్స్ సామర్థ్యం మరింత బలపడనుంది. రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, భారత నౌకాదళ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పీ-8ఐ విమానానికి అనుగుణంగా ADC-150 వ్యవస్థను తక్కువ సమయంలోనే అభివృద్ధి చేసి అర్హత పరీక్షలు పూర్తి చేశారు. అభివృద్ధి దశలోని అన్ని ఫ్లైట్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ వ్యవస్థను భారత నౌకాదళంలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.