అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో కొత్త వివాదం; టిప్పు సుల్తాన్‌ను ఎవరు చంపారు?
కర్ణాటకలో మరో నెలరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. 18వ శతాబ్దపు పాలకుడు టిప్పు సుల్తాన్‌పై తాజాగా వివాదం రాజుకుంది. టిప్పు సుల్తాన్‌ను ఎవరు చంపారనే అంశాన్ని బీజేపీ ఎన్నికల అంశంగా మార్చింది. వొక్కలిగ సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు బీజేపీ టిప్పు సుల్తాన్ అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. చాలా ఏళ్లుగా వొక్కలిగ సామాజిక వర్గం కాంగ్రెస్, జేడీఎస్‌కు మద్దతుగా నిలుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో వొక్కలిగ వర్గాన్ని ఆకర్షించేందుకు సావర్కర్ పేరుతో బీజేపీ ఇతర పార్టీలపై విమర్శలు గుప్పిస్తోంది. టిప్పు సుల్తాన్‌ను బ్రిటిష్ సైన్యం కానీ, మరాఠా సైన్యంకానీ చంపలేదని, వొక్కలిగ వర్గానికి చెందిన ఊరి గౌడ, నంజె గౌడ చంపారని బీజేపీ వాదిస్తోంది.
ఊరి గౌడ, నంజె గౌడ ఉనికి కొట్టిపారేస్తున్న చరిత్రకారులు
టిప్పు సుల్తాన్‌ను ఇద్దరు వొక్కలిగ నాయకులు ఊరి గౌడ, నంజె గౌడ చంపారని పాత మైసూరు బెల్ట్‌లోని ఒక వర్గం వాదిస్తుండగా, అడ్డండ కరియప్ప రచించిన టిప్పు నిజకనాసుగలు (టిప్పు నిజమైన కలలు) పుస్తకంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ రెండు ఆధారాలను పరిగణలోకి తీసుకున్న బీజేపీ టిప్పు సుల్తాన్‌ను ఊరి గౌడ, నంజె గౌడ చంపారని బలంగా వాదిస్తోంది. ఈ వాదనను చరిత్రకారులు వ్యతిరేకిస్తున్నారు. వొక్కలిగ వర్గానికి చెందిన మఠాధిపతి కూడా ఇవి నిరాధారమైన ఆరోపణలని కొట్టి పారేశారు. అయితే కాంగ్రెస్, జనతాదళ్ సెక్యులర్ పార్టీలు మాత్రం ఊరి గౌడ, నంజే గౌడ ఉనికిలో లేరని, ఇవి కల్పిత పాత్రలు కావొచ్చని రెండు పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.