ప్రపంచంలోనే బీజేపీ అత్యంత ముఖ్యమైన పార్టీ: వాల్ స్ట్రీట్ జర్నల్
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ జనతా పార్టీపై అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. బీజేపీ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ అని పేర్కొంది. వాల్టర్ రస్సెల్ మీడ్ ఈ కథనాన్ని రాశారు.
అమెరికా జాతీయ ప్రయోజనాల దృక్కోణంలో భారతదేశంలోని అధికార పార్టీ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ అని వాల్‌స్ట్రీట్ పేర్కొంది. అయితే ఇది అందరికి అర్థం కాకపోవచ్చని కథనంలో చెప్పింది.
భారతీయులు కాని వారికి బీజేపీ రాజకీయ, సాంస్కృతిక చరిత్ర తెలియదని రచయిత మీడ్ అభిప్రాయపడ్డారు. అందుకే చాలామంది బీజేపీ అర్థం చేసుకోలేదని చెప్పారు.
ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న చైనాను కట్టడి చేయడం అనేది భారత్ మద్దతు లేకుండా అమెరికాకు సాధ్యం కాదన్నారు.
బీజేపీ
2024లో కూడా హ్యాట్రిక్ గెలుపుకోసం బీజేపీ ఆరాటం
2014, 2019లో బీజేపీ వరుస విజయాల తర్వాత 2024లో కూడా హ్యాట్రిక్ గెలుపుకోసం ఉవ్విళ్లూరుతోందని మీడ్ పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ వ్యూహరచనలో భారత్ అగ్రగామిగా ఉందన్నారు.
ఏన్నో ఏళ్ల నుంచి అనేకమంది ఆలోచనాపరులు, కార్యకర్తలు చేసిన ప్రయత్నాల ఫలితమే నేడు బీజేపీ బలంగా తయారవ్వడానికి దోహదపడినట్లు మీడ్ వెల్లడించారు.
బిలియన్ కంటే ఎక్కువ మంది జనాభా ఉన్న దేశాన్ని ప్రపంచ సూపర్ పవర్‌గా నిలపాలని బీజేపీ భావిస్తోందని చెప్పారు.
హిందూ పార్టీగా చెప్పుకొనే బీజేపీ, ఈశాన్య ప్రాంతంలోని క్రైస్తవులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో అత్యంత అద్భుతమైన విజయాలను నమోదు చేసినట్లు గుర్తుచేశారు.
దాదాపు 200 మిలియన్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో షియా ముస్లింల నుంచి బలమైన మద్దతును పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.