గుజరాత్‌లో 13సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయ్: సంజయ్‌పై కేటీఆర్ ఫైర్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్( టీఎస్‌పీఎస్‌సీ) పేపర్ల లీకేజీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. ఈ కేసులోని నిందితులు బీజేపీ యాక్టివ్ కార్యకర్తలని కేటీఆర్ అన్నారు. పేపర్ల లీకేజీ వ్యవహారం బీజేపీ చేసిన కుట్రగా అభివర్ణించారు. నియామక ప్రక్రియ వేగంగా జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే బీజేపీ ఈ పని చేయించిందని కేటీఆర్ మండిపడ్డారు. యువత జీవితాలతో ఆడుకుంటున్న బండి సంజయ్ లాంటి వారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు.
బండి సంజయ్ రాజకీయ అజ్ఞాని: కేటీఆర్
గుజరాత్‌లో 13సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసారు. అలా అని ప్రధాని మోదీని రాజీనామా చేయమని అడిగే దమ్ము బండి సంజయ్‌కు ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వ హయాల్లో వందసార్లకు పైగా పేపర్ల లీకేజీ జరిగిందన్నారు. బండి సంజయ్ రాజకీయ అజ్ఞాని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థల పట్ల ఆయనకు ఏమాత్రం అవగాహన లేదన్నారు. టీఎస్‌పీఎస్‌సీ అనే ప్రభుత్వ శాఖ కాదని, అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని కేటీఆర్ పేర్కొన్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి బండి సంజయ్ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.