
TSPSC సంచలన నిర్ణయం; గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏఓ పరీక్షలు రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్( టీఎస్‌పీఎస్‌సీ) సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ తోపాటు ఏఈఈ, డీఏఓ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
అసిస్టెంట్ ఇంజనీర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిన నేపథ్యంలో సిట్ నివేదిక ఆధారంగానే పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ వెల్లడించింది.
అంతేకాకుండా రద్దు చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 11వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొంది.
టీఎస్‌పీఎస్‌సీ
త్వరలో ఏఈఈ, డీఏఓ పరీక్షల తేదీల వెల్లడి
గతేడాది సెప్టెంబర్ 16న గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న డీఏఓ ఎగ్జామ్స్ నిర్వహించారు.
ఈ క్రమంలో టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన దాదాపు 5 పరీక్షా పేపర్లు లీకైనట్లు గురువారం సీట్ అధికారులు గుర్తించారు. ఆ 5 పేపర్లలో గ్రూప్-1 ప్రిలిమ్స్ తోపాటు ఏఈఈ, డీఏఓ పేపర్లు ఉన్నాయి.
అందుకే మొత్తం పరీక్షలను రద్దు చేసిన తిరిగి నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావించింది.
ఏఈఈ, డీఏఓ పరీక్షల తేదీలను ఇంకా వెల్లడించలేదు.