ICC Mens T20 World Cup: పాక్ బహిష్కరణ నిర్ణయం ఆమోదయోగ్యం కాదు: ఐసీసీ
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 వరల్డ్‌కప్ 2026 గ్రూప్ దశలో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్ ప్రభుత్వమే తమ జట్టుకు ఆదేశించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా నిర్ణయం ప్రపంచ క్రీడా నియమాలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయం తమ దృష్టికి వచ్చినప్పటికీ.. ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) నుంచి అధికారిక సమాచారం కోసం ఇంకా ఎదురుచూస్తున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది. టోర్నమెంట్‌లో ఎంపిక చేసిన మ్యాచ్‌ల్లో మాత్రమే పాల్గొనడం అనే వైఖరి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది.
Details
ఈ నిర్ణయం సరైంది కాదు
జాతీయ విధానాలకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వాల పాత్రను గుర్తించి, గౌరవిస్తున్నప్పటికీ.. ఈ నిర్ణయం సరైంది కాదనే అభిప్రాయాన్ని వెల్లడించింది. అంతేకాదు ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు మాత్రమే కాదు.. పాకిస్థాన్‌లోని లక్షలాది మంది అభిమానులకు కూడా మేలు చేయదని వ్యాఖ్యానించింది. ఈ నిర్ణయం పాకిస్థాన్ క్రికెట్‌పై చూపే దీర్ఘకాలిక ప్రభావాలను జాగ్రత్తగా పరిశీలించాలని పీసీబీని ఐసీసీ కోరింది. ప్రపంచ క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లకు ప్రత్యేకమైన ఆకర్షణ ఉందని ఐసీసీ గుర్తు చేసింది. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు సరిగా లేకపోయినా.. 2012 నుంచి ఐసీసీ నిర్వహిస్తున్న ప్రధాన టోర్నమెంట్లలో ఈ రెండు జట్లను ఒకే గ్రూపులో ఉంచుతూ వస్తోంది.
Details
పీసీబీపై చర్యలు తీసుకొనే అవకాశం
ఒకవేళ పాకిస్థాన్.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే.. 2010 తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగని తొలి ఐసీసీ టోర్నీగా 2026 టీ20 వరల్డ్‌కప్ నిలిచే అవకాశముంది. పాకిస్థాన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే.. పీసీబీపై ఐసీసీ పలు చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో పాల్గొనేందుకు అవసరమైన నిరభ్యంతర పత్రాల (ఎన్‌ఓసీలు) విషయంలో ఆంక్షలు విధించే అవకాశముంది. దీని వల్ల పాకిస్థాన్‌కు భారీ ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఐసీసీ టోర్నమెంట్ల నిర్వహణ హక్కులను కూడా పాక్ కోల్పోయే పరిస్థితి ఏర్పడవచ్చని తెలుస్తోంది.
Details
బీసీసీఐ అధికారిక ప్రకటన చేయలేదు
ఫిబ్రవరి 15న శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను తాము బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్ నిర్ణయానికి సంబంధం లేకుండా.. షెడ్యూల్ ప్రకారం భారత జట్టు శ్రీలంకకు వెళ్లనుందని సమాచారం. టీమ్‌ఇండియా ప్రాక్టీస్ సెషన్లలోనూ పాల్గొననుందని తెలుస్తోంది. అలాగే మ్యాచ్‌కు ముందు జరిగే విలేకరుల సమావేశంలోనూ హాజరవుతుందని సమాచారం. ఒకవేళ పాకిస్థాన్ జట్టు మ్యాచ్ ఆడేందుకు మైదానంలోకి రాకపోతే..మ్యాచ్ రిఫరీ తీసుకునే నిర్ణయం కోసం భారత జట్టు ఎదురుచూడనుందని తెలిసింది. అయితే ఈఅంశంపై ఇప్పటివరకు బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. నాకౌట్ దశలో భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడాల్సి వస్తే పరిస్థితి ఏంటన్న విషయంపై పీసీబీ నుంచి ఇప్పటికీ పూర్తి స్పష్టత రాలేదు.