Loading...
Krishna Water Dispute: కృష్ణా జలాలపై యథాతథ స్థితి కొనసాగింపు.. కర్ణాటకకు సుప్రీంకోర్టు షాక్
కర్ణాటకకు సుప్రీంకోర్టు షాక్

Krishna Water Dispute: కృష్ణా జలాలపై యథాతథ స్థితి కొనసాగింపు.. కర్ణాటకకు సుప్రీంకోర్టు షాక్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 28, 2026
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదంలో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2 (KWDT-2) ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్‌లో ప్రచురించేలా ఆదేశాలు ఇవ్వాలన్న కర్ణాటక విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగుతుందని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా కర్ణాటక తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం రాష్ట్రానికి 173 టీఎంసీల కృష్ణా జలాల వాటా రావాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు స్టేజ్-3 అమలుకు ఇప్పటికే రూ.29 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు.

వివరాలు 

ఇది సున్నితమైన అంతర్రాష్ట్ర వివాదమని ధర్మాసనం వ్యాఖ్య

అయితే ట్రైబ్యునల్ తీర్పు గెజిట్ నోటిఫికేషన్ వెలువడకపోవడంతో నిర్మించిన కాలువలు వినియోగంలోకి రావడం లేదని పేర్కొన్నారు.

రాయచూర్, యాదగిరి వంటి కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగునీటి అవసరం అత్యవసరమని వివరిస్తూ, 2011లో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు.

ఈ వాదనలను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. కృష్ణా జలాల అంశం అనేక న్యాయపరమైన, సాంకేతిక అంశాలతో ముడిపడి ఉన్న సున్నితమైన అంతర్రాష్ట్ర వివాదమని వ్యాఖ్యానించింది.

ఈ కేసులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు దాఖలు చేసిన అప్పీళ్లు, అభ్యంతరాలను కూడా సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది.

చాలా కాలంగా అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వులను తొందరపాటుతో సవరించడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది.

వివరాలు 

తదుపరి విచారణ సెప్టెంబరు మొదటి వారానికి వాయిదా

విచారణ సందర్భంగా ఈ కేసులో తుది తీర్పు వెలువరించకుండా తాను పదవీ విరమణ చేయబోనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.

అనంతరం తదుపరి విచారణను సెప్టెంబరు తొలి వారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

ADVERTISEMENT