Karnataka High Court: 'నికాహ్'కు షరియా చట్టమే వర్తిస్తుంది.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ముస్లిం వివాహాలపై కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ముస్లిం దంపతులు తమ వివాహాన్ని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ (SMA) కింద రిజిస్టర్ చేసినప్పటికీ.. ఆ వివాహానికి వర్తించే వ్యక్తిగత చట్టం మారదని స్పష్టం చేసింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం జరిగిన 'నికాహ్'కు షరియా చట్టమే వర్తిస్తుందని పేర్కొంది. జస్టిస్ డీకే. సింగ్, జస్టిస్ టీఎమ్. నదాఫ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ 'సజీద్ పర్వేజ్ వర్సెస్ ఫర్జానా తాజ్' కేసులో ఈ తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా ఫ్యామిలీ కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం సమర్థించింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద విడాకులు మంజూరు చేయాలని భర్త దాఖలు చేసిన పిటిషన్ చెల్లదని తేల్చి చెప్పింది.
వివరాలు
'నికాహ్' అసలు స్వభావం మారదు
వివాహాన్ని SMA కింద నమోదు చేయడం వల్ల 'నికాహ్' అసలు స్వభావం మారదని హైకోర్టు స్పష్టం చేసింది.
ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రకారం వివాహం జరిగితే.. దానికి సంబంధించిన హక్కులు, బాధ్యతలు, విడాకుల అంశాలపై కూడా అదే వ్యక్తిగత చట్టంలోని నిబంధనలే వర్తిస్తాయని పేర్కొంది.
విదేశాలకు వెళ్లడం, వీసా పొందడం వంటి అవసరాల కోసం వివాహాన్ని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన ముస్లిం పర్సనల్ లా అమలు కాకుండా పోదని ధర్మాసనం తెలిపింది.
కేవలం రిజిస్ట్రేషన్ విధానం మారినంత మాత్రాన వివాహానికి వర్తించే వ్యక్తిగత చట్టాన్ని మార్చలేమని స్పష్టం చేసింది.
వివరాలు
దంపతులు విడాకుల కోసం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌ను ఆధారంగా చేసుకోలేరు: హైకోర్టు
ముస్లిం పర్సనల్ లా ప్రకారం 'నికాహ్' చేసుకున్న దంపతులు విడాకుల కోసం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌ను ఆధారంగా చేసుకోలేరని హైకోర్టు వెల్లడించింది.
వ్యక్తిగత చట్టాల కింద జరిగిన వివాహాలకు ఆయా మతాలకు సంబంధించిన నిబంధనలే వర్తిస్తాయని పేర్కొంది.
అదేవిధంగా, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద విడాకులు కోరాలంటే.. ఆ వివాహం కూడా మొదటినుంచే అదే చట్టం కింద జరిగి ఉండాలని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.
కేవలం వివాహాన్ని SMA కింద నమోదు చేసుకున్న కారణంతోనే.. దంపతులకు ఆ చట్టంలోని విడాకుల నిబంధనలను వర్తింపజేయలేమని తీర్పులో పేర్కొంది.