రాజస్థాన్లో ఘోరం.. చంద్రయాన్-3 విజయాన్ని ఆస్వాదిస్తున్న స్టూడెంట్స్‌పై కశ్మీరీ విద్యార్థుల దాడి
రాజస్థాన్లోని మేవార్ విశ్వవిద్యాలయంలో తీవ్ర అలజడులు చెలరేగాయి. చంద్రయాన్-3 విజయోత్సవ వేడుకల సందర్భంగా కశ్మీరీ విద్యార్థులు హంగామా సృష్టించారు. దీంతో విద్యార్థి వర్గాల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. మెస్ లో రాహుల్ అనే విద్యార్థిపై కశ్మీరీ విద్యార్థులు దాడి చేశారని తోటి విద్యార్థులు చెప్పారు. ఘటనలో ఆయుష్ శర్మ, కృష్ణపాల్ శర్మ తీవ్రంగా గాయపడగా, వారిని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆగస్ట్ 23న చంద్రయాన్-3 విజయవంతంపై ఆయుష్ శర్మ సంబరాలు చేసుకున్నాడు. విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతంపై భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలు చేశాడు. అక్కడే ఉన్న కాశ్మీరీ విద్యార్థులు దీనిపై అభ్యంతరం తెలిపారు. రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఆయుధాలతో దాడికి దిగే వరకు వెళ్లినట్లు సమాచారం.