Page Loader
బీఆర్ఎస్ కిసాన్ సెల్‌ జిల్లా అధ్యక్షుల నియామకం వేగవంతం.. కేసీఆర్ ఫోకస్

బీఆర్ఎస్ కిసాన్ సెల్‌ జిల్లా అధ్యక్షుల నియామకం వేగవంతం.. కేసీఆర్ ఫోకస్

వ్రాసిన వారు Stalin
Dec 26, 2022
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత.. బీఆర్‌ఎన్‌ను విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు అధినేత కేసీఆర్. 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదంతో జనవరిలో రైతుల సమస్యలపై పెద్ద బహిరంగ సభను నిర్వహించనున్న నేపథ్యంలో... వివిధ రాష్ట్రాల్లో కిసాన్ సెల్‌ల జిల్లా అధ్యక్షుల నియామకాలను వేగవంతం చేశారు. కిసాన్ సెల్‌ జిల్లా అధ్యక్షుల నియామకం బాధ్యతను జాతీయ కిసాన్ సెల్ ఛైర్మన్ సర్దార్ గుర్నామ్ సింగ్‌కు కేసీఆర్ అప్పగించారు. ఇప్పటికే పంజాబ్‌లోని జిల్లా యూనిట్ల అధ్యక్షుల నియామకం దాదాపు పూర్తికాగా.. ఇతర రాష్ట్రాల్లో కసరత్తు జరుగుతోంది.

బీఆర్ఎస్

రైతులను ఆకర్షించేందుకు ప్రణాళిక..

వాస్తవానికి డిసెంబర్ నెలాఖరు నాటికి ఆరు రాష్ట్రాల్లో కిసాన్ సెల్‌ను ప్రారంభిస్తామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా సహా మరో మూడు రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్ జెండాలు ఎగురవేస్తామని చెప్పారు. చెప్పిన విధంగానే కేసీఆర్...ఆ దిశగా ముందుకెళ్తున్నారు. బీఆర్‌ఎస్ భావజాలాన్ని దేశవ్యాప్తంగా వ్యాప్తి చేసేందుకు వివిధ భాషల్లో పాటలు, సాహిత్యాన్ని కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు. కన్నడ, మరాఠా, ఒడిశా సహా పలు భారతీయ భాషల కవులు, పాటల రచయితలతో చర్చలు జరుపుతున్నారు. తన ఆలోచనలకు తగ్గట్టుగా, ప్రజలను ఆకర్షించే విధంగా పాటలు, నినాదాలు ఉండేలా కేసీఆర్ జాగ్రత్తులు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ తొలి ప్రయత్నం దేశంలోని రైతులను ఆకర్షించడమేనని, ఆ విధంగా పార్టీ ప్రణాళికను కేసీఆర్ రూపొందిస్తారని సీనియర్ నేత ఒకరు చెప్పారు.