దిల్లీలో ఘోరం.. స్నేహితుడి కుమార్తెపై ఉన్నతాధికారి రేప్, కేజ్రివాల్ సీరియస్
దిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. తన స్నేహితుడి కూమార్తెపై గత కొద్ది నెలలుగా అత్యాచారం చేసిన దారుణ ఘటన దేశ రాజధానిలో కలకలం సృష్టించింది. దిల్లీ ప్రభుత్వంలో పనిచేసే ఓ ఉన్నతోద్యోగి ఈ దారుణానికి ఒడిగట్టాడు. 12వ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి ఎగబడ్డాడు. ఘటనపై స్పందించిన సీఎం కేజ్రీవాల్ తక్షణమే నిందితుడ్ని ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశించారు. ఈ మేరకు దిల్లీ ప్రభుత్వంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ సీనియర్ అధికారిపై ఆయన మండిపడ్డారు. సాయంత్రం 5 గంటల్లోగా తనకు నివేదిక సమర్పించాలని సీఎస్ ను కేజ్రీవాల్ ఆదేశించారు. ఈ మేరకు నిందుతుడిపై ఆదివారం కేసు నమోదైంది.
పలుమార్లు రేప్, గర్భం దాల్చిన బాధితురాలు
14 ఏళ్ల బాధిత విద్యార్థిని ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్నారు. 2020లో ఆమె తన తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఖఃంలో ఉన్నారు. తన తండ్రి స్నేహితుడు డబ్ల్యూసీడీ శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. మిత్రుడి మరణం తర్వాత బాధిత కుటుంబాన్ని బాగా చూసుకుంటానని నమ్మబలికాడు. అప్పటి నుంచి నిందితుడి కుటుంబంతోనే కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలోనే మైనర్‌పై 2020 నుంచి 2021 మధ్య పలుమార్లు రేప్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె గర్భం దాల్చింది. విషయాన్ని తన భార్యకు చెప్పగా, ఆమె బాధితురాలికి తెలియకుండా గర్బనిరోధక మాత్రలను ఇచ్చింది. అలా చిన్నారికి తెలీయకుండానే అబార్షన్ అయిపోయింది.
తీవ్రంగా స్పందించిన దిల్లీ మహిళా కమిషన్
కొన్నాళ్లకు బాధితురాలు 2021 జనవరిలో తల్లి వద్దకు తిరిగి వచ్చేసింది. 2023 ఆగస్టులో అనారోగ్యం, మానసిక ఆందోళనతో ఉన్న చిన్నారిని ఓ కౌన్సిలర్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ జరిగిందంతా ఆమె వివరించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై తీవ్రంగా స్పందించిన దిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ సదరు అధికారిని వేటగాడితో పోల్చారు. బిడ్డలను కాపాడాల్సిన వాడు వేటగాడిగా మారితే అమ్మాయిలు ఎక్కడికి పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే నిందితుడ్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆస్పత్రికి చేరుకుని నిరసన తెలిపారు. మరోవైపు అధికారిని పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదు. కేవలం నోటీసులు మాత్రమే జారీ చేశారు.