
అత్యాచార బాధితురాలి కేసులో హైకోర్టుపై సుప్రీం సీరియస్.. అబార్షన్‌కు గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
అత్యాచారం బాధితురాలికి సుప్రీంకోర్టు సంచలన ఊరట కలిగించింది. ఈ మేరకు అవాంచిత గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతులు మంజూరు చేసింది.
గర్భం తొలగింపు నిమిత్తం తనకు అనుమతివ్వాలని అత్యాచార బాధితురాలు పెట్టుకున్న పిటిషన్‌ను తొలుత గుజరాత్ హైకోర్టు కొట్టేసింది.
దీంతో బాధితురాలు సుప్రీంను ఆశ్రయించింది. స్పందించిన అత్యున్నత న్యాయస్థానం, గుజరాత్ న్యాయస్థానంలో అసలు ఏం జరుగుతోందని సీరియస్ అయ్యింది.
సర్వోన్నత ఆదేశాలకు వ్యతిరేకంగా దిగువ కోర్టులు ఉత్తర్వులు ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది. అలా చేయడం రాజ్యాంగ విరుద్ధమేనని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
అసాధారణ కేసుల్లో పని వేగం చూపించాలని, నిర్లక్ష్య వైఖరి సరికాదని కింది కోర్టులకు సుప్రీం మార్గనిర్దేశం చేసింది.
details
గర్భం దాల్చడం దంపతులకు సంతోషకరం,అవివాహితురాలికి ఇబ్బందులు : సుప్రీం
భారత సమాజంలో వివాహ వ్యవస్థకు ప్రత్యేకమైన స్థానం ఉందని, గర్భం ధరించడం భార్యభర్తలకు చాలా సంతోషకరమైన విషయమని సుప్రీం పేర్కొంది. సమాజానికీ ఆ విషయం సానుకూల సంకేతాన్నిస్తుందని వివరించింది.
కానీ అవివాహిత మహిళ గర్భం దాల్చితే అది బాధిత మహిళపై చెడు ప్రభావం చూపిస్తుందని చెప్పింది. ఈ నేపథ్యంలోనే అత్యున్నత న్యాయస్థానం బాధిత మహిళకు ఊరట కల్పిస్తూ తీర్పును వెలువరించింది.
గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి నిరాకరించిన గుజరాత్ హైకోర్టు తీర్పును సుప్రీం తప్పుపట్టింది. మరోవైపు ఈ కేసులో ఈనెల 20లోగా వైద్య నివేదికను సమర్పించాలని గత విచారణలో భాగంగానే ధర్మాసనం కోరింది.