Loading...
CEC Gyanesh Kumar: రూ.2 కోట్ల లంచం ఆరోపణలు.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు
రూ.2 కోట్ల లంచం ఆరోపణలు.. సీఈసీపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు

CEC Gyanesh Kumar: రూ.2 కోట్ల లంచం ఆరోపణలు.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2026
01:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేరళలో అప్పటి పీడబ్ల్యూడీ కార్యదర్శి, ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై వచ్చిన లంచం ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. దాదాపు 20 ఏళ్ల క్రితం రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన రూ.17 కోట్ల బిల్లుల చెల్లింపు కోసం ఆయన రూ.2 కోట్లు డిమాండ్ చేసినట్లు ఓ మాజీ కాంట్రాక్టర్ ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరపాలని కేరళ హోంమంత్రి రమేశ్ చెన్నితల విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో (వీఏసీబీ)ని ఆదేశించారు.

వివరాలు 

రూ.17 కోట్ల బిల్లుల చెక్కుల నిలిపివేత 

కొల్లాం జిల్లాలోని చడయమంగళంకు చెందిన సాజన్ అనే కాంట్రాక్టర్ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు.

కేరళ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్టు (కేఎస్‌టీపీ)లో భాగంగా తాము పూర్తి చేసిన పనులకు సంబంధించిన బిల్లులు విడుదల చేయడానికి అప్పటి పీడబ్ల్యూడీ కార్యదర్శి జ్ఞానేశ్ కుమార్ రూ.2 కోట్లు లంచం అడిగారని ఆరోపించారు.

ఇంజినీర్లు ఇప్పటికే ఆమోదించిన సుమారు రూ.17 కోట్ల బిల్లుల చెక్కులను కావాలనే నిలిపివేశారని పేర్కొన్నారు.

దీంతో మలేసియాకు చెందిన పీఏటీఐ-బెల్ కంపెనీతో పాటు అందులో పనిచేసే కాంట్రాక్టర్లు, ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఫిర్యాదులో వివరించారు.

వివరాలు 

లంచం ఇవ్వడానికి నిరాకరించడంతో బిల్లులు నిలిపివేత?

కంపెనీ ప్రాజెక్టు ఇంజినీర్, మలేసియా పౌరుడు లీ సీ బీన్ తనకు ఈ విషయాన్ని వెల్లడించారని సాజన్ తెలిపారు.

లంచం డిమాండ్‌ను నెరవేర్చేవరకు చెక్కులు విడుదల చేయడానికి జ్ఞానేశ్ కుమార్ నిరాకరించినట్లు లీ చెప్పారని పేర్కొన్నారు.

అయితే కంపెనీ అధికారులు లంచం ఇచ్చి బిల్లులు తీసుకోవడానికి అంగీకరించలేదని ఫిర్యాదులో తెలిపారు.

ఈ వ్యవహారంలో మరో తీవ్రమైన ఆరోపణ కూడా ఉంది.బిల్లుల చెల్లింపులో జాప్యం,లంచం డిమాండ్ కారణంగా లీ సీ బీన్ 2006లో ఆత్మహత్య చేసుకున్నారని సాజన్ ఆరోపించారు.

తన సూసైడ్ నోట్‌లో జ్ఞానేశ్ కుమార్ పాత్రను లీ ప్రస్తావించినట్లు ఆయన కుటుంబసభ్యులు కంపెనీ ఉద్యోగులకు తెలిపారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

2006లోనే ప్రారంభమైన విచారణ

లీ మరణం తర్వాత 2006లోనే ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది.

అయితే ఆరోపణలకు తగిన ఆధారాలు లభించకపోవడంతో తదుపరి చర్యలు తీసుకోకుండానే విచారణను నిలిపివేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఆ విచారణ సమయంలో తనను, ఇతర కీలక సాక్షులను అధికారులు ప్రశ్నించలేదని సాజన్ తాజా ఫిర్యాదులో పేర్కొన్నారు.

అవసరమైతే లీ కుటుంబ సభ్యులు, కంపెనీ మాజీ ఉద్యోగులు, ఇతర సాక్షులను విచారణకు హాజరుపరుస్తానని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

మరో అవినీతి ఆరోపణపైనా విచారణ

తాజా ఫిర్యాదుపై ప్రాథమిక పరిశీలన చేసిన విజిలెన్స్ విభాగం కేసు నమోదు చేసేందుకు హోంశాఖ అనుమతి కోరింది.

న్యాయపరమైన అభిప్రాయం తీసుకున్న తర్వాత హోంమంత్రి విచారణకు ఆదేశించారు.

ఇదిలా ఉండగా, కేరళ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్టులో భాగంగా ఎంసీ రోడ్డు విస్తరణ పనుల్లో అవినీతి జరిగిందన్న మరో ఫిర్యాదుపైనా విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది.

కాంగ్రెస్ నేత మలయింకీజ్ వేణుగోపాల్ అక్టోబర్ 4న చేసిన ఫిర్యాదు మేరకు ఈ విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై ప్రతిపక్షాలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను విమర్శిస్తూ నిరసనలు తెలుపుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

ADVERTISEMENT