LOADING...
Konaseema: కోనసీమ గోదావరి తీరాన సంక్రాంతి సంబరాలు.. ఆత్రేయపురంలో ఉత్సాహంగా డ్రాగన్‌ పడవ పోటీలు.. 
ఆత్రేయపురంలో ఉత్సాహంగా డ్రాగన్‌ పడవ పోటీలు..

Konaseema: కోనసీమ గోదావరి తీరాన సంక్రాంతి సంబరాలు.. ఆత్రేయపురంలో ఉత్సాహంగా డ్రాగన్‌ పడవ పోటీలు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 13, 2026
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'సర్‌ ఆర్థర్‌కాటన్‌ గోదావరి ట్రోఫీ' సంక్రాంతి వేడుకలు సోమవారం ఘనంగా కొనసాగాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన డ్రాగన్‌ పడవ పోటీలు కేరళలో జరిగే జలక్రీడలను తలపించేలా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 12 జట్లు, కేరళ నుంచి 5 జట్లు, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి రెండు చొప్పున, తమిళనాడు నుంచి ఒక జట్టు హాజరయ్యాయి. ఆత్రేయపురం ప్రధాన పంట కాలువలో సుమారు కిలోమీటరు మేర ఈ పడవ పోటీలు నిర్వహించారు. పోటీలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జెండా ఊపి ప్రారంభించారు.

వివరాలు 

విజేతలకు ట్రోఫీలు, ప్రోత్సాహక బహుమతులు 

ఉచ్చిలి నుంచి స్థానిక రేవు వంతెన వరకు ఒకేసారి మూడు పడవల చొప్పున సాయంత్రం వరకూ ఉత్కంఠభరితంగా పోటీలు సాగాయి. ఇందులో విజయం సాధించిన ఆరు జట్లు మంగళవారం జరిగే సెమీఫైనల్స్‌, ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. సెమీఫైనల్స్‌కు బండారు బృందం (కొత్తపేట), కోనసీమ, పల్నాడు-1, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లా ఎర్రకాలువ, కేరళ (అలెప్పీ) జట్లు ఎంపికయ్యాయి. విజేతలకు ట్రోఫీలు, ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి జట్టులో 12 మంది క్రీడాకారులు ఉండగా, అందులో 10 మంది పడవ నడిపేందుకు, మరో ఇద్దరు సహాయకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ పోటీలను రిఫరీలు, కోచ్‌లు, సాంకేతిక సిబ్బంది కలిపి మొత్తం 25 మంది పర్యవేక్షిస్తున్నారని చీఫ్‌ రిఫరీ కృష్ణమూర్తి వెల్లడించారు.

వివరాలు 

ప్రత్యేక ఆకర్షణగా 'జెట్‌స్కీ'

ఈ కార్యక్రమంలో మరో ప్రధాన ఆకర్షణగా కేరళకు చెందిన జలక్రీడల నిర్వాహకులు ప్రదర్శించిన జెట్‌స్కీ (ఎయిర్‌ ఫ్లై) నిలిచింది. స్పీడ్‌ బోటుకు అనుసంధానించిన పైపుల ద్వారా అధిక పీడనంతో వచ్చే నీటి సాయంతో ఒక వ్యక్తి గాలిలో దాదాపు 20 అడుగుల ఎత్తు వరకు ఎగిరి చేసిన విన్యాసాలు ప్రేక్షకులను విస్మయానికి గురిచేశాయి. తాము గత ఐదేళ్లుగా ఈ తరహా జల విన్యాసాలు నిర్వహిస్తున్నామని జాబిన్‌రాజ్‌, జోసెఫ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అమలాపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌ అల్లాడి స్వామినాయుడుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కోనసీమలో సంక్రాంతి సంబరాలు 

Advertisement