Keralam: ఆస్తులు రాయించుకుని తల్లిదండ్రులను వదిలేస్తే మూడేళ్ల జైలు శిక్ష!
ఈ వార్తాకథనం ఏంటి
తల్లిదండ్రుల నుంచి ఆస్తులు రాయించుకుని, ఆ తర్వాత వారిని పట్టించుకోకుండా వదిలేసే పిల్లలపై కేరళ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. అలాంటి వారిపై మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా కొత్త చట్టంలో నిబంధనలు తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి వి.డి.సతీశన్ ప్రకటించారు. వృద్ధుల హక్కులు,సంక్షేమం,సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర అసెంబ్లీ అక్టోబర్‌లో ఆమోదించిన బిల్లులో ఈ నిబంధనను చేర్చినట్లు వెల్లడించారు. కొల్లం సమీపంలోని పతనపురంలోని గాంధీభవన్‌లో రూ.20కోట్ల వ్యయంతో నిర్మించిన 'పితృమందిరం'వృద్ధుల నివాస సముదాయాన్ని సీఎం ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన కొత్త చట్టంలోని అంశాలను వివరించారు. తల్లిదండ్రుల నుంచి ఆస్తులు పొందిన తర్వాత వారిని నిర్లక్ష్యం చేసే పిల్లలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వివరాలు
వృద్ధుల కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు
యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్న తొలి నిర్ణయాల్లో వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు ఒకటని సతీశన్ గుర్తుచేశారు.
దేశంలోనే తొలిసారిగా కేరళలో ఈ తరహా శాఖను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వయోవృద్ధులకు ప్రత్యేక హక్కులు కల్పించడంతో పాటు వారి సంరక్షణకు సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర చట్టాన్ని రూపొందించినట్లు వివరించారు.
ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించి, చట్టం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆస్తులు తీసుకున్న తర్వాత తల్లిదండ్రులను గాలికొదిలేసే వారిని చట్టం ప్రకారం జైలుకు పంపుతామని స్పష్టం చేశారు.
ఇలాంటి వ్యవహారాల్లో ఎలాంటి మినహాయింపులు ఉండబోవని పేర్కొన్నారు.
వివరాలు
తల్లిదండ్రులను అనాథలుగా వదిలేయకూడదు
పిల్లలను పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు, త్యాగాలు చేస్తారని సీఎం అన్నారు.
పిల్లల భవిష్యత్తు కోసం తమ జీవితాలను అంకితం చేసే తల్లిదండ్రులను, వారు పెద్దయ్యాక అనాథలుగా వదిలేయడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు.
ఇలాంటి పరిస్థితులు కేరళ సమాజంలో ఉండకూడదని అభిప్రాయపడ్డారు. వృద్ధులను ప్రేమతో ఆదరించే సంస్కృతి సమాజంలో పెరగాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలో ఏ ఒక్క వృద్ధుడూ ఒంటరిగా మిగిలిపోకూడదని, ప్రతి ఒక్కరికీ తగిన సంరక్షణ, గౌరవం లభించాలన్నదే తన లక్ష్యమని తెలిపారు.
వివరాలు
లులు గ్రూప్ ఛైర్మన్‌కు సీఎం ప్రశంసలు
పతనపురంలోని పితృమందిరం నిర్మాణానికి పూర్తిస్థాయిలో ఆర్థిక సహాయం అందించిన లులు గ్రూప్ ఛైర్మన్ ఎం.ఎ. యూసుఫ్ అలీని సీఎం ప్రత్యేకంగా అభినందించారు.
ఎంత సంపద ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేయాలనే గొప్ప మనసు ఆయనకు ఉందని కొనియాడారు.
వృద్ధుల కోసం ఇలాంటి సేవా కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.