Page Loader
సలహాదారుల నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సలహాదారుల నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సలహాదారుల నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Stalin
Jan 06, 2023
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

వివిధ శాఖలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారులను నియమించడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం సలహాదారులను నియమించే అధికారం ఉందా? లేదా? అనే దానిపై లోతుగా విచారణ జరపాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని డివిజన్‌ ​​బెంచ్‌ పేర్కొంది. ఎండోమెంట్స్ శాఖ సలహాదారుగా జ్వాలాపురపు శ్రీకాంత్‌ నియామకాన్ని సవాల్‌ చేస్తూ ఏపీ సేవాబ్రాహ్మణ సంఘ సమాఖ్య ప్రతినిథి హెచ్‌కే రాజశేఖర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. సలహాదారుల నియామకానికి సంబంధించిన అన్ని వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది.

హైకోర్టు

'సలహాదారుల విధానం కొత్తది కాదు'

సలహాదారుగా శ్రీకాంత్ నియామకంపై మధ్యంతర స్టేను సవరించిన కోర్టు తదుపరి విచారణ వరకు అతను పదవిలో కొనసాగడానికి అనుమతించింది. రిటైర్డ్ ఉద్యోగి చంద్రశేఖర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (ఉద్యోగుల వ్యవహారాలు) నియమించడాన్ని, శ్రీకాంత్‌ను ఎండోమెంట్స్ అడ్వైజర్‌గా నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను కలపాలని కోర్టు రిజిస్ట్రీని దర్మాసనం ఆదేశించింది. సీఎం, మంత్రుల సలహాదారుల నియామకం అర్థవంతంగా ఉంది కానీ, శాఖకు ప్రత్యేకంగా సలహాదారులను నియమించడంపై కోర్టు అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఆయా రంగాలకు చెందిన అనుభవజ్ఞులను సలహాదారులుగా ప్రభుత్వం నియమిస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. ఈ‌పద్ధతి కొత్త కాదని, గతంలో కూడా ఎండోమెంట్స్ శాఖకు సలహాదారులు ఉండేవారని ధర్మాసనం ఎదుట తన వాదనలు వినిపించారు.