TGSP : తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. 39 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్ల సస్పెన్షన్
తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) కానిస్టేబుళ్ల ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బెటాలియన్ల పరిధిలో పని చేస్తున్న టీజీఎస్పీ కానిస్టేబుళ్లు డ్యూటీలో వెట్టి చాకిరి చేస్తున్నారనే ఆరోపణలతో నిరసనకు దిగిన విషయం తెలిసిందే. తొలుత కుటుంబ సభ్యులు ఈ నిరసనల్లో పాల్గొనగా, ఇక కానిస్టేబుళ్లే స్వయంగా రోడ్లపైకి వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని నిరసనలు చేశారు. ఈ పరిస్థితుల్లో ఒకే విధానం అమలు చేయాలని, వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ శాఖ ఈ నిరసనలను సీరియస్‌గా తీసుకుంటూ, 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కానిస్టేబుళ్ల ఆందోళనపై స్పందించిన డీజీపీ
నిరసనలకు ప్రేరేపించి క్రమశిక్షణ ఉల్లంఘించినందుకుగానూ ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. సస్పెండ్ చేసినవారిలో వివిధ బెటాలియన్లకు చెందిన కానిస్టేబుళ్లు ఉన్నారు. బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనపై డీజీపీ జితేందర్ స్పందించారు. పోలీస్ వ్యవస్థ క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాలని, ఈ విధమైన నిరసనలు చేయడం తగదని అన్నారు. ప్రభుత్వం ఈ వివాదంపై స్పందించి, కానిస్టేబుళ్లపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసింది. అలాగే, వారికి పాత సెలవుల విధానాన్నే కొనసాగించడానికి హామీ ఇచ్చింది.