Loading...
Ganesh Mandapam: వినాయక మండపాలపై కీలక ఆదేశాలు.. ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే!
వినాయక మండపాలపై కీలక ఆదేశాలు.. ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే!

Ganesh Mandapam: వినాయక మండపాలపై కీలక ఆదేశాలు.. ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 05, 2026
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సురక్షితమైన వాతావరణంలో నిర్వహించేందుకు నగర పోలీస్ కమిషనర్ 'శంఖబ్రత బాగ్చి' పలు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాలు, విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అనుమతుల ప్రక్రియను సులభతరం చేసేందుకు 'ఏపీ పోలీస్ సేవా పోర్టల్' ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్ దరఖాస్తు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. నిర్వాహకులు వేర్వేరు శాఖల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. పోలీస్, జీవీఎంసీ, అగ్నిమాపక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్ శాఖల నుంచి అవసరమైన క్లియరెన్స్‌లను ఆన్‌లైన్‌లోనే ఒకేసారి పొందేలా చర్యలు చేపట్టారు.

వివరాలు

దరఖాస్తులో పూర్తి వివరాలు తప్పనిసరి

వినాయక విగ్రహం, మండపం ఏర్పాటుకు అనుమతి కోరే సమయంలో నిర్వాహకులు ప్రతిపాదిత విగ్రహం ఎత్తు, ఉపయోగించే పదార్థాలు, ఏర్పాటు చేయనున్న స్థలం, భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా, స్పష్టంగా పొందుపరచాలి.

ప్రజా ప్రశాంతతకు ఎలాంటి విఘాతం కలగకుండా మండప నిర్వాహకులు భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, విద్యుత్ సౌకర్యాలు, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పోలీసులు సూచించారు.

అలాగే దర్శనాల పేరుతో లేదా చందాల పేరుతో ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం తీవ్ర నేరమని సీపీ శంఖబ్రత బాగ్చి హెచ్చరించారు.

ఇలాంటి ఘటనలపై ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

భక్తులకు స్వచ్ఛందంగా సౌకర్యాలు కల్పించాలి తప్ప, ఎలాంటి నిబంధనల ఉల్లంఘనకు తావివ్వకూడదని సూచించారు.

వివరాలు

భారీ మండపాలకు అదనపు భద్రత

భారీ విగ్రహాలు, పెద్ద మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు రాత్రి వేళల్లో స్వచ్ఛంద సేవకులతో కాపలా ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ చర్యల ద్వారా అవాంఛనీయ సంఘటనలను ముందుగానే అరికట్టవచ్చని పోలీసులు తెలిపారు.

మరోవైపు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలని యంత్రాంగం పిలుపునిచ్చింది.

ADVERTISEMENT

వివరాలు

నిమజ్జనం, శోభాయాత్రల్లో డీజేలకు నో

పండుగ ముగింపు సందర్భంగా నిర్వహించే వినాయక నిమజ్జనం, శోభాయాత్రల సమయంలో అధిక శబ్దాలు చేసే డీజేలు, లౌడ్ స్పీకర్ల వినియోగంపై పూర్తి నిషేధం విధించారు.

ఈ నిబంధనలను నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు.

ప్రజలు, వినాయక మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించి.. అన్ని నిబంధనలను పాటిస్తూ వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతమైన సురక్షిత వాతావరణంలో నిర్వహించాలని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కోరారు.

ADVERTISEMENT