Loading...
Andhra Pradesh: ఖరగ్‌పుర్‌-అమరావతి హైస్పీడ్‌ కారిడార్‌కు ఓకే.. ఏపీలో 457 కి.మీ. రహదారి!
ఖరగ్‌పుర్‌-అమరావతి హైస్పీడ్‌ కారిడార్‌కు ఓకే.. ఏపీలో 457 కి.మీ. రహదారి!

Andhra Pradesh: ఖరగ్‌పుర్‌-అమరావతి హైస్పీడ్‌ కారిడార్‌కు ఓకే.. ఏపీలో 457 కి.మీ. రహదారి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2026
08:46 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పుర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు నిర్మించనున్న నాలుగు వరుసల హైస్పీడ్‌ రోడ్‌ కారిడార్‌కు సంబంధించి ఏపీలో ఎలైన్‌మెంట్‌కు ఆమోదం లభించింది. రాష్ట్రంలో 457 కి.మీ. మేర నిర్మించనున్న ఈ కారిడార్‌కు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మార్గాన్ని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్‌)లోని ఎలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ (ఏఏసీ) తాజాగా ఆమోదించింది. ఖరగ్‌పుర్‌-అమరావతి కారిడార్‌ను పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 1,107 కి.మీ. మేర నిర్మించనున్నారు. ఏపీలో కురుపాం, పార్వతీపురం, సాలూరు, మక్కువ, అరకు, పాడేరు, చింతపల్లి, గోకవరం, కన్నాపురం, జంగారెడ్డిగూడెం, లక్కవరం, దేవరపల్లి, కామవరపుకోట, ద్వారకా తిరుమల, నూజివీడుల మీదుగా రహదారి వెళ్లనుంది.

వివరాలు

భూసేకరణకు కసరత్తు

ఆగిరిపల్లి సమీపంలో ఈ కారిడార్‌ అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో అనుసంధానం కానుంది. ఈ 457 కి.మీ. మార్గానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమ్మతి తెలిపింది.

ఈ హైస్పీడ్‌ కారిడార్‌ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల మీదుగా సాగనుంది.

రహదారి నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు ఆయా జిల్లాల్లో సంయుక్త కలెక్టర్‌ లేదా డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారుల్లో ఒకరిని భూసేకరణ అధికారి (కాలా)గా నియమించాల్సి ఉంటుంది.

ఇప్పటికే పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి జిల్లాలకు భూసేకరణ అధికారులను ఎంపిక చేశారు. వారిని అధికారికంగా గుర్తించి గెజిట్‌ జారీ చేసేందుకు అవసరమైన వివరాలను మోర్త్‌ ఉన్నతాధికారులకు పంపించారు.

మిగిలిన జిల్లాలకు సంబంధించిన అధికారుల పేర్లను ఈ వారంలో పంపించనున్నారు.

వివరాలు

ఏపీలో అంచనా వ్యయం రూ.32 వేల కోట్లు

నాలుగు రాష్ట్రాల్లో నిర్మించనున్న ఈ కారిడార్‌ మొత్తం 1,107 కి.మీ. పొడవు ఉంటుంది. రహదారి కోసం 90 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయనున్నారు.

గంటకు 100 నుంచి 120 కి.మీ. వేగంతో వాహనాలు ప్రయాణించేలా రహదారిని డిజైన్‌ చేయనున్నారు.

ఈ ప్రాజెక్టుకు మొత్తం 10,630 హెక్టార్ల భూమి అవసరం కాగా, అందులో 2,371 హెక్టార్ల అటవీ భూమి ఉంటుంది.

భూసేకరణ, పునరావాసానికి కలిపి రూ.8,982 కోట్లు ఖర్చవుతుందని అంచనా. సివిల్‌ పనుల విలువ రూ.55,772 కోట్లుగా ఉండనుంది.

ఇతర అనుమతులు, సంబంధిత ఖర్చులను కలుపుకుంటే మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.75,629 కోట్లకు చేరనుంది.

ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని 457 కి.మీ. కారిడార్‌ నిర్మాణానికి సుమారు రూ.32 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

మార్చి నాటికి ప్రాజెక్టుకు మంజూరు?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్రాజెక్టుకు మంజూరు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోనూ ఎలైన్‌మెంట్‌పై స్పష్టత వచ్చిన తర్వాత సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను ఖరారు చేయనున్నారు.

అనంతరం మార్చి నాటికి మొత్తం ప్రాజెక్టును మంజూరు చేయాలని కేంద్రం భావిస్తోంది.

ADVERTISEMENT