IND vs PAK: పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలకు భారత్ ఘాటు కౌంటర్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ తీవ్రంగా స్పందించింది. అవాస్తవ ఆరోపణలు చేస్తూ ఆధారంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది. సంబంధం లేని అంశాలపై అర్థరహిత వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటుగా మారిందని విదేశాంగ శాఖ వర్గాలు విమర్శించాయి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ సీషెల్స్‌లో పర్యటించిన సందర్భంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్' అవార్డును అందుకున్నారు. ఈ గౌరవంపై స్పందించిన ఖవాజా ఆసిఫ్.. ఇది స్వయంగా ఇప్పించుకున్న అవార్డని, నిజమైన గుర్తింపు కాదంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
'గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్'అందుకున్న తొలి వ్యక్తిగా ప్రధాని మోదీ
ఈ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది.వాస్తవాలపై అవగాహన లేకుండానే ఆయన నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. పనిలేక అర్థరహిత వ్యాఖ్యలతో కాలం గడుపుతున్నారని,ఆయన వ్యాఖ్యలు వాస్తవాలకు పూర్తిగా విరుద్ధమని విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అసూయతో చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ సానుకూల ఫలితాలను ఇవ్వవని,అవి విద్వేషాన్ని మాత్రమే పెంచుతాయని తెలిపారు. విద్వేషపూరిత ప్రసంగాలను అలవాటు చేసుకున్నవారిలో ఇలాంటి ధోరణి మరింత ఎక్కువగా కనిపిస్తుందని కూడా అధికారులు వ్యాఖ్యానించారు. కాగా,సీషెల్స్ అత్యున్నత పురస్కారమైన 'గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్'అందుకున్న తొలి వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. మోదీ సీషెల్స్ పర్యటనకు కొన్ని వారాల ముందే,జూన్ 24న ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేయాలని అక్కడి మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది.