టీచర్స్ స్కామ్: 59 మంది ఉపాధ్యాయులను తొలగించాలని హైకోర్టు ఆదేశం
అక్రమ పద్ధతిలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొలువులు సాధించిన వారిపై కోల్‌కతా హైకోర్టు కోరడా ఝులిపించింది. తప్పుడు మార్గాల ద్వారా ఉద్యోగాలను పొందిన 59మందిని విధుల నుంచి తొలగించాలని పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్ల్యూబీఎస్‌ఎస్‌సీ)ను జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశించింది. ఇప్పటికే రెండు పర్యాయాలు అక్రమంగా ఉపాధ్యాయ కొలువును సంపాంధించిన వారిని హైకోర్టు తోలగించింది. బుధవారం 143 మంది ప్రాథమిక ఉపాధ్యాయుల సర్వీసులను రద్దు చేస్తూ జస్టిస్ గంగోపాధ్యాయ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 23న 53 మంది టీచర్ల సర్వీసులను రద్దు చేస్తూ ఇదే బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఇచ్చి ఆదేశాలతో తొలగించిన టీచర్ల సంఖ్య 255కి చేరింది.
సుప్రీంకోర్టు ఆదేశంతో..
అక్రమ పద్ధతిలో నియామకమైన 269 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగించాలని గతేడాది జస్టిస్ గంగోపాధ్యాయ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తమ వాదనలు వినకుండా.. ఏకపక్షంగా హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు 269 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి వాదనలు కూడా వినాలని జస్టిస్ గంగోపాధ్యాయ నేతృత్వంలోని సింగిల్ బెంచ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ లెక్కన అఫిడవిట్‌లు దాఖలు చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించింది. ఈ క్రమంలో తాజాగా 61 మంది ఉపాధ్యాయులు ఈ విషయంలో తమ అఫిడవిట్‌లను దాఖలు చేశారు. వారి అఫిడవిట్లు, ఇతర పత్రాలను పరిశీలించిన జస్టిస్ గంగోపాధ్యాయ.. అందులో 59 మందిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. మిగిలిన ఇద్దరి భవితవ్యం త్వరలో తేలనుంది.