LOADING...
ONGC gas leak: 4 రోజుల్లో పూర్తిగా అదుపులోకి  బ్లోఅవుట్‌.. కోనసీమ జిల్లా కలెక్టర్‌ వెల్లడి  
కోనసీమ జిల్లా కలెక్టర్‌ వెల్లడి

ONGC gas leak: 4 రోజుల్లో పూర్తిగా అదుపులోకి  బ్లోఅవుట్‌.. కోనసీమ జిల్లా కలెక్టర్‌ వెల్లడి  

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2026
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

కోనసీమ జిల్లాలో సంభవించిన బ్లోఅవుట్‌ ప్రమాదం నియంత్రణలోకి రానుందని కలెక్టర్ మహేష్‌కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్,ఓఎన్జీసీ (ONGC) అధికారులు హాజరైన విలేకర్ల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 5న బ్లోఅవుట్ సంభవించగా,ఆ సమయంలో భారీ మంటలు పుట్టాయి.ప్రస్తుతం మంటల ఉద్ధృతి తగ్గినందున, సిబ్బంది ప్రమాద స్థలానికి 10మీటర్ల దూరంలో చేరి నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. మరో నాలుగు రోజుల్లో మంటలను పూర్తిగా అదుపు చేసి,బావిపై క్యాపింగ్ వేస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ ఘటన చుట్టూ ఉన్న గ్రామాల ప్రజల సాధారణ జీవన విధానంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం లేదని తెలిపారు. అలాగే, మంటల కారణంగా నష్టపోయిన వారికి పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

వివరాలు 

ప్రజల ఆందోళన 

బ్లోఅవుట్ సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొన్నట్టు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. "ఇరుసుమండ, గుబ్బలవారిపాలెం, లక్కవరం, చింతలపల్లి గ్రామాల ప్రజలు జీవన భయం వల్ల పరుగులు పెట్టారు. మంటలను నియంత్రించేందుకు ఆ ప్రాంతంలో కనీస నీటి వనరులు కూడా లేవు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఓఎన్జీసీని స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులకు ముందుగా సమాచారాన్ని అందించాలని, లేకుంటే స్థానిక కార్యకలాపాలను అడ్డుకుంటామని ఎమ్యెల్యే హెచ్చరించారు. బాధిత గ్రామాల ప్రజలకు ఓఎన్జీసీ పరిహారం అందించి, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందని, లక్కవరం లో రూ.25 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.

వివరాలు 

రక్షణ బాధ్యత ఓఎన్జీసీ సంస్థదే 

ఓఎన్జీసీ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా మాట్లాడుతూ, భూఉపరితలం,సముద్ర జలాల్లో తమ చమురు బావుల్లో ఏ కార్యకలాపాలు జరిగితే ఆ ప్రాంతం రక్షణ బాధ్యత ఓఎన్జీసీకి మాత్రమే ఉన్నట్టు తెలిపారు. "ప్రస్తుతానికి మంటల తీవ్రత తగ్గింది. మరికొన్ని రోజుల్లో మంటలను పూర్తిగా అదుపు చేసి, బావిపై క్యాపింగ్‌ను అమలు చేస్తాం. బ్లోఅవుట్ జరిగిన బావి చుట్టూ శకలాలు తొలగింపు కూడా జరుగుతోంది" అని ఆయన వివరించారు.

Advertisement