కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు
మహారాష్ట్రలోని రత్నగిరి నుంచి కోజికోడ్ జిల్లాకు వెళ్తున్న ఎలత్తూరు రైలు దహనం కేసు నిందితుల రవాణాకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసిన ఆరోపణలపై కేరళ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి పి.విజయన్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. ఈయన రాష్ట్ర ఏటీఎస్ విభాగం అధిపతిగా కూాడా పని చేశారు. ప్రస్తుతం ఇన్‌స్పెక్టర్ జనరల్ హోదాలో పని చేస్తున్నారు. నిందితుడి రవాణాకు సంబంధించిన సమాచారం లీక్ కావడం తీవ్రమైన భద్రతా వైఫల్యమని సస్పెన్షన్ ఆర్డర్‌లో ప్రభుత్వం పేర్కొంది. లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ ఎంఆర్ అజిత్ కుమార్ సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం పి.విజయన్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.
సమగ్ర దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం
రైలు దహనం కేసును దర్యాప్తు చేస్తున్న బృందంలో లేని ఇన్‌స్పెక్టర్ జనరల్ ర్యాంక్ అధికారి విజయన్, గ్రేడ్ ఎస్‌ఐ మనోజ్ కుమార్ నిందితులను రోడ్డు మార్గంలో కోజికోడ్‌కు తీసుకువెళుతున్న క్రమంలో అధికారులను వారి వివరాలు అడిగినట్లు సస్పెన్షన్ ఆర్డర్‌లో ప్రభుత్వం చెప్పింది. పోలీసు ఏటీఎస్ విభాగం మరింత జాగ్రత్తగా, నిష్పక్షపాతంగా ఉండాలన్న ఉద్దేశంతోనే అనుమానంతో విచారణకు ఆదేశించినట్లు వివరించింది. అందుకే ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు విజయన్‌ను సర్వీసు నుంచి సస్పెండ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏడీజీపీ (పోలీస్ హెచ్‌క్యూ) పద్మకుమార్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది.