Ram Janmabhoomi Trust: అయోధ్య రామాలయ ట్రస్టుకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్‌ను నియమించారు. విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సమర్పించిన రాజీనామాను ట్రస్టు ఆమోదించింది. అదే సమయంలో కొత్త సీఈవో నియామక ప్రక్రియను చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సోమవారం అయోధ్యలో నిర్వహించిన ట్రస్టు సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని అతిథి గృహంలో సాయంత్రం 3.30 గంటలకు ప్రారంభమైన సమావేశం సుమారు మూడు గంటలపాటు కొనసాగింది.
వివరాలు
సమావేశానికి హాజరైన ఏడుగురుసభ్యులు
ట్రస్టులోని మొత్తం తొమ్మిది మంది శాశ్వత సభ్యుల్లో ఏడుగురు సమావేశానికి హాజరయ్యారు. ట్రస్టు ఛైర్మన్ నృత్య గోపాల్ దాస్ సమావేశానికి హాజరుకాగా,చంపత్ రాయ్,అనిల్ మిశ్ర మాత్రం గైర్హాజరయ్యారు. సమావేశం అనంతరం ట్రస్టు కోశాధికారి గోవింద్ గిరి మీడియాతో మాట్లాడుతూ చంపత్ రాయ్‌తో పాటు ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్ర సమర్పించిన రాజీనామాలను ఆమోదించినట్లు తెలిపారు. ప్రస్తుతం ట్రస్టు పరిపాలనా వ్యవహారాలు అంతరాయం లేకుండా కొనసాగేందుకు కృష్ణ మోహన్‌కు తాత్కాలిక ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అదనంగా అప్పగించినట్లు వెల్లడించారు. విరాళాల దుర్వినియోగంపై చంపత్ రాయ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని గోవింద్ గిరి తెలిపారు. ఈ వ్యవహారంలో నిందితులు గుర్తించబడి వారికి శిక్ష పడే వరకు తనకు మనశ్శాంతి ఉండదని చంపత్ రాయ్ పేర్కొన్నట్లు వెల్లడించారు.
వివరాలు
ఎవరీ కృష్ణ మోహన్?
ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెల 22న తదుపరి ట్రస్టు సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అప్పటికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తుది నివేదిక అందే అవకాశం ఉందని వివరించారు. ఉత్తర్‌ప్రదేశ్'లోని హర్దోయ్‌కు చెందిన కృష్ణ మోహన్ ప్రస్తుతం శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు శాశ్వత సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆరెస్సెస్ సీనియర్ సభ్యుడిగా పనిచేసిన ఆయన, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) మాజీ అధికారిగా సేవలందించారు. 2025 సెప్టెంబరులో ట్రస్టు శాశ్వత సభ్యుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వయసు 73 సంవత్సరాలు. లఖ్‌నవూ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన కృష్ణ మోహన్ తన సేవా జీవిత ప్రారంభంలో అణుశక్తి విభాగంలో పనిచేశారు.
వివరాలు
రామాలయ నిర్మాణానికి రూ.2,370 కోట్లు ఖర్చు
అనంతరం మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారిగా వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు. రామాలయ నిర్మాణానికి ఇప్పటివరకు వచ్చిన మొత్తం విరాళాల్లో రూ.3,264 కోట్లలో రూ.2,370 కోట్లు ఆలయ నిర్మాణ పనులకే వెచ్చించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. ఆలయ నిర్వహణకు సంబంధించిన ఖర్చుల కోసం భక్తుల విరాళాల నుంచి మరో రూ.391 కోట్లు వినియోగించినట్లు తెలిపింది. మిగిలిన నిధులు బ్యాంకు ఖాతాల్లో భద్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది. భక్తులు సమర్పించిన వెండి ఆభరణాలను వెండి కడ్డీలుగా మార్చి సురక్షితంగా నిల్వ ఉంచినట్లు ట్రస్టు పేర్కొంది.
వివరాలు
రామాలయ నిర్మాణానికి రూ.2,370 కోట్లు ఖర్చు
2020లో ప్రారంభించిన 'నిధి సమర్పణ్ అభియాన్' అనంతరం ఇప్పటివరకు మొత్తం రూ.3,264 కోట్ల విరాళాలు అందినట్లు వెల్లడించింది. ఆలయం ప్రారంభమైన తర్వాత భక్తులు కానుకల రూపంలో మరో రూ.582 కోట్లు సమర్పించినట్లు తెలిపింది. భక్తుల నుంచి వచ్చిన ప్రతి విరాళం, కానుకకు సంబంధించిన లెక్కలు పూర్తిస్థాయిలో నమోదు చేసినట్లు ట్రస్టు స్పష్టం చేసింది. ముందస్తు అనుమతి తీసుకుని ఎవరైనా వచ్చి ఆ లెక్కలను పరిశీలించవచ్చని వెల్లడించింది.