Krishna Water Dispute: కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ అక్టోబర్ 13కు వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన వివాదంలో దాఖలైన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89లో జలాల పంపిణీకి విధివిధానాలు ఉన్నప్పటికీ.. వాటికి అదనంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. కేంద్రం నోటిఫికేషన్‌పై ఏపీ అభ్యంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా ట్రైబ్యునల్-1 కేటాయించిన 811 టీఎంసీలతో పాటు భవిష్యత్తులో అదనంగా ఏవైనా నీటి కేటాయింపులు జరిగితే వాటిని ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని కేంద్ర జలశక్తి శాఖ 2023 అక్టోబర్ 6న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అదనపు విధివిధానాలను ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది.
వివరాలు
తుది దశలో ట్రైబ్యునల్ విచారణ..
పార్లమెంటు ఆమోదించిన రాష్ట్ర పునర్విభజన చట్టం అమల్లో ఉన్న సమయంలో.. దానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా కొత్త విధివిధానాలు తీసుకురావడం సరికాదని పేర్కొంది.
ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ 2023లోనే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ కేసు గతంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ వి.మోహన్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.
అయితే ఇది అత్యవసరంగా విచారించాల్సిన కేసు కాదని భావించిన ధర్మాసనం.. తదుపరి విచారణ కోసం మరో బెంచ్‌కు బదిలీ చేసింది.
తాజాగా గురువారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ముందు ఏపీ పిటిషన్ విచారణకు వచ్చింది.
వివరాలు
రెండేళ్లుగా ట్రైబ్యునల్ ముందు వాదనలు
ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్త వాదనలు వినిపించారు.
ఈ కేసులో 2023 నవంబర్‌లోనే నోటీసులు జారీ అయ్యాయని,అనంతరం విచారణ కూడా ప్రారంభమైందని ధర్మాసనానికి వివరించారు.
ఈ వ్యవహారంలో అన్ని పక్షాలు తమ అఫిడవిట్లను దాఖలు చేశాయని తెలిపారు.
నోటీసులు జారీ చేసే సమయంలోనే ఇరుపక్షాలు ట్రైబ్యునల్ ముందు తమ వాదనలు కొనసాగించవచ్చని,అయితే ట్రైబ్యునల్ నిర్ణయం సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసిందని జైదీప్ గుప్త గుర్తుచేశారు.
దీంతో గత రెండేళ్లుగా ట్రైబ్యునల్ ముందు ఇరురాష్ట్రాలు తమ వాదనలు కొనసాగిస్తున్నాయని చెప్పారు.
ఇప్పటికే తెలంగాణ తరఫు వాదనలు,వాటికి ఏపీ సమాధానాలు పూర్తయ్యాయని తెలిపారు.
ప్రస్తుతం ఏపీ వాదనలకు తెలంగాణ సమాధానాలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందని వివరించారు.
వివరాలు
త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ విజ్ఞప్తి
ట్రైబ్యునల్ విచారణ ప్రస్తుతం తుది దశకు చేరుకున్నందున.. సుప్రీంకోర్టు కూడా ఈ పిటిషన్‌పై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని జైదీప్ గుప్త ధర్మాసనాన్ని కోరారు.
ఇందుకోసం ఒక తేదీని నిర్ణయించి, ఇరుపక్షాల వాదనలు పూర్తిగా వినాలని విజ్ఞప్తి చేశారు.
ఏపీ తరఫు న్యాయవాది అభ్యర్థనకు ధర్మాసనం అంగీకరించింది.
తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేస్తూ జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాలు
ఉమ్మడి ప్రాజెక్టులపై పిటిషన్లు జనవరికి వాయిదా
ఇదిలా ఉండగా.. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి అప్పగించాలని ఏపీ కోరుతూ, అందుకు తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన మరో రెండు పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి.
అయితే ఈ రెండు పిటిషన్లను వెంటనే విచారించాల్సిన అవసరం లేదని ఏపీ తరఫు న్యాయవాది జైదీప్ గుప్త తెలిపారు.
అవసరమైతే వాటి విచారణను కొంతకాలం వాయిదా వేయవచ్చని ధర్మాసనానికి సూచించారు.
ఈ అభ్యర్థనకు ధర్మాసనం అంగీకరించింది. ఆ రెండు పిటిషన్లపై విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది.