Loading...
KRMB: కరెంట్ కోసం నీళ్లు విడుదల చేయలేం.. తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ స్పష్టత
కరెంట్ కోసం నీళ్లు విడుదల చేయలేం.. తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ స్పష్టత

KRMB: కరెంట్ కోసం నీళ్లు విడుదల చేయలేం.. తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ స్పష్టత

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2026
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ఉన్న నీటిని చాలా జాగ్రత్తగా, పొదుపుగా ఉపయోగించుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సూచించింది. ఉమ్మడి జలాశయాల నుంచి కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసమే నీటిని విడుదల చేయడం కుదరదని స్పష్టం చేసింది. ముందుగా తాగునీటి అవసరాలకు, ఆ తర్వాత సాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. ఈ రెండు అవసరాలు తీర్చిన తర్వాతే ఇతర అవసరాల కోసం నీటిని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. సెప్టెంబరు 4న కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీశ్ కంబోజ్ అధ్యక్షతన త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను బోర్డు తాజాగా రెండు రాష్ట్రాలకు పంపింది.

వివరాలు 

నీటి పంపకాలపై ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి భగ్గుమన్న విభేదాలు

2026 సెప్టెంబరు నుంచి 2027 ఆగస్టు వరకు సాగునీటి అవసరాలు, నీటి కేటాయింపులపై సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు.

ఈ అంశంపై త్వరలో నిర్వహించనున్న 21వ కేఆర్ఎంబీ పూర్తిస్థాయి సమావేశంలో మరోసారి చర్చించనున్నారు.

మరోవైపు, త్రిసభ్య కమిటీ సమావేశ మినిట్స్‌లో వాస్తవ పరిస్థితులను సరిగ్గా నమోదు చేయలేదని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది.

మినిట్స్‌ను తాము అంగీకరించడం లేదని పేర్కొంటూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ రమేశ్ బాబు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాశారు.

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ కూడా తన అవసరాలను బోర్డు దృష్టికి తీసుకెళ్లింది.

రాష్ట్రంలో తాగునీటి సరఫరాతో పాటు చెరువులను నింపేందుకు 2027 ఆగస్టు వరకు మొత్తం 104 టీఎంసీల నీరు అవసరమవుతుందని ఏపీ ఈఎన్‌సీ కేఆర్ఎంబీకి విన్నవించారు.

వివరాలు 

66:34 నిష్పత్తిలో నీరు కేటాయించాలని కోరుతున్న ఆంధ్రప్రదేశ్

సెప్టెంబరు 3 నాటికి జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలను ప్రాతిపదికగా తీసుకుని 66:34 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన 97.41 టీఎంసీల నీటిని వెంటనే విడుదల చేయాలని కోరారు.

అయితే, నీటి పంపిణీ విషయంలో తెలంగాణ భిన్నమైన వాదనను వినిపిస్తోంది.

కృష్ణా జలాలను 50:50 నిష్పత్తిలో పంచాలని తెలంగాణ ఈఎన్‌సీ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేఆర్ఎంబీ తన వైఖరిని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని షెడ్యూల్-12లో పేర్కొన్న నిబంధనల ప్రకారమే నీటి వినియోగానికి ప్రాధాన్యతలను నిర్ణయిస్తున్నామని బోర్డు తెలిపింది.

అంటే విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే ఉమ్మడి జలాశయాల నుంచి నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని మరోసారి తేల్చిచెప్పింది.

ADVERTISEMENT