Chandrababu: ఏపీలో పోలీసులకు రక్షణ కరువు.. మహిళా పోలీసు డ్రెస్ లాగడంపై మండిపడ్డ చంద్రబాబు
అనంతపురంలోని గుల్జారి పేట సెబ్ పోలీస్ స్టేషన్‌పై కొందరు వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఏపీలో పోలీసులకు రక్షణ కరువైందని, మహిళా పోలీసుల దుస్తులు లాగుతూ ఈడ్చుకెళ్లడాన్ని అధికార పార్టీ నేతలు ఎలా సమర్థించుకుంటారని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు అనంతపురంలోని ఎస్ఈబీ పీఎస్‌పై జరిపిన దాడిని చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో వైసీపీ కార్యకర్తలతో పాటు వాలంటీర్లు కూడా పాల్గొనడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి : నారా లోకేశ్
ఒక నేరగాడికి అధికారం ఇచ్చినందుకు ప్రజలు భయం భయంగా బతకాల్సి వస్తోందని చంద్రబాబు అవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. సెబ్ పోలీస్ స్టేషన్ పై వైసీపీ సైకోల దాడి అన్యాయమని, అక్రమ మద్యం కేసులో పట్టుబడిన వ్యక్తిని వదిలేయాలంటూ పోలీసులపై దాడి చేయడం వైసీపీ నేతల అహంకారానికి నిదర్శమని చెప్పారు. మహిళా పోలీస్ డ్రెస్ పట్టుకొని బయటకు ఈడ్చుకెళ్లిన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అనుచరుడు సాకే చంద్రశేఖర్‌ని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.