LOADING...
Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి ముగింపు
47 ఏళ్ల నిషేధానికి ముగింపు

Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి ముగింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2026
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లిం మెజారిటీ జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో 47 ఏళ్లుగా అమల్లో ఉన్న మద్యం నిషేధానికి తెరదించింది. కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చి, నియంత్రిత పద్ధతిలో లైసెన్స్ పొందిన దుకాణాల ద్వారా మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల లక్షద్వీప్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఊతమిస్తుందని భావిస్తున్నారు.

వివరాలు 

1973 నుంచి అమల్లో ఉన్న నిషేధానికి ముగింపు

లక్షద్వీప్‌లో 1973 నుంచి మద్యం అమ్మకాలపై నిషేధం కొనసాగుతోంది. ఇందుకోసం అమలులో ఉన్న 'లక్షద్వీప్ ప్రొహిబిషన్ రెగ్యులేషన్'ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దాని స్థానంలో 'లక్షద్వీప్ ఎక్సైజ్ రెగ్యులేషన్-2026'ను అమల్లోకి తీసుకొచ్చింది. జూన్ 5 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్త చట్టం ప్రకారం మద్యం తయారీ, నిల్వ, దిగుమతి, ఎగుమతి, రవాణా, కొనుగోలు, అమ్మకం, వినియోగం వంటి అంశాలను లైసెన్సింగ్ విధానం ద్వారా నియంత్రించనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, ఇతర గుర్తింపు పొందిన ఏజెన్సీలు కూడా మద్యం దిగుమతి, రిటైల్ విక్రయాలకు లైసెన్సులు పొందే అవకాశం కల్పించారు.

వివరాలు 

ముస్లిం మెజారిటీ ప్రాంతం కావడంతో నిషేధం

లక్షద్వీప్ జనాభాలో సుమారు 97 శాతం మంది ముస్లింలు. ఇస్లాం మతంలో మద్యం సేవించడం నిషేధం కావడంతో అక్కడ మద్యం విక్రయాలపై కఠిన ఆంక్షలు అమలయ్యాయి. 1979 నుంచి ఈ నిషేధానికి స్థానిక రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు కూడా మద్దతు ఇస్తూ వచ్చాయి. అయితే, కవరత్తి, బంగారం ద్వీపాల్లోని కొన్ని పర్యాటక రిసార్టులు, ప్రభుత్వ నిర్వహణలో ఉన్న బార్లకు మాత్రం ప్రత్యేక మినహాయింపులు ఉండేవి.

Advertisement

వివరాలు 

పర్యాటక రంగానికే ప్రాధాన్యం

లక్షద్వీప్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దాలన్న ప్రణాళికలో భాగంగానే కొత్త ఎక్సైజ్ విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ 2024లో లక్షద్వీప్ పర్యటన చేసిన తర్వాత ఈ ప్రాంతంపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. దీంతో పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2020లో కేవలం 3,875 మంది మాత్రమే లక్షద్వీప్‌ను సందర్శించగా, 2024 నాటికి ఆ సంఖ్య 68 వేల మందికి చేరడం విశేషం.

Advertisement

వివరాలు 

మద్యం విక్రయాలకు అనుమతి.. కానీ భారీ పన్నులు

మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చినప్పటికీ, ఎక్సైజ్ సుంకాలను భారీగా నిర్ణయించారు. కొత్త విధానం ప్రకారం.. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL), విదేశీ మద్యంపై 400 శాతం ఎక్సైజ్ సుంకం బీర్‌పై 200 శాతం పన్ను వైన్‌పై 80 శాతం ఎక్సైజ్ సుంకం విధించారు. దీంతో మద్యం విక్రయాలను నియంత్రిస్తూనే ప్రభుత్వానికి ఆదాయం పెంచాలన్న లక్ష్యాన్ని కూడా కేంద్రం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

లక్షద్వీప్ ప్రత్యేకత ఏంటి?

లక్షద్వీప్ మొత్తం 36 ద్వీపాల సమూహం. వీటిలో అగట్టి, అమిని, ఆండ్రోట్, బిట్రా, చెట్లట్, కడ్మత్, కల్పేని, కవరత్తి, కిల్తాన్, మినీకాయ్ సహా 10 ద్వీపాల్లో జనావాసం ఉంది. మరో 17 ద్వీపాలు నిర్జనంగా ఉండగా, ఇటీవల నాలుగు చిన్న ద్వీపాలు కొత్తగా ఏర్పడ్డాయి. భారతీయులు, విదేశీ పర్యాటకులు లక్షద్వీప్‌ను సందర్శించాలంటే ప్రత్యేక అనుమతి తప్పనిసరి. విదేశీ పర్యాటకులకు ప్రస్తుతం అగట్టి, బంగారం, కడ్మత్ ద్వీపాల సందర్శనకే అనుమతి ఉంది.

Advertisement