హరీష్ సాల్వే వివాహానికి హాజరైన లలిత్ మోదీ.. విపక్షాల విమర్శలు
భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే తన బ్రిటిష్ స్నేహితురాలు భాగస్వామి ట్రినాను ఆదివారం లండన్‌లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి నీతా అంబానీ, లక్ష్మీ మిట్టల్, సహా హై ప్రొఫైల్ అతిథులు హాజరయ్యారు. ఈ పెళ్లికి ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ హాజరు కావడంపై భారత్‌లో రాజకీయ దుమారాన్ని రేపింది. జమిలి ఎన్నికలపై ఇటీవల కేంద్రం వేసిన అత్యున్నత స్థాయి కమిటీలో హరీష్ సాల్వే సభ్యుడిగా ఉన్నారు. 753 కోట్ల రూపాయల మనీలాండరింగ్ ఆరోపణలతో దేశం విడిచి పారిపోయన వ్యక్తిని హరీష్ సాల్వే ఎలా ఆహ్వానిస్తారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. లలిత్ మోదీ వివాహానికి హాజరైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ప్రతిపక్షాలు పెద్దఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఎవరు ఎవరిని రక్షిస్తున్నారు: శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది
మోదీ 2010లో పన్ను ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలతో లలిత్ మోదీ దేశం విడిచి లండన్ పారిపోయారు. భారత చట్టాలను తప్పించుకుని పారిపోయిన వ్యక్తిని ప్రధాని మోదీకి ఇష్టమైన న్యాయవాది హరీష్ తన పెళ్లికి ఎలా పిలుస్తారని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు. ఎవరు ఎవరికి సహాయం చేస్తున్నారు? ఎవరు ఎవరిని రక్షిస్తున్నారని అడిగారు. 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' కమిటీలో సభ్యుడైన హరీష్ సాల్వే లలిత్ మోదీ, మొయిన్ ఖురేషీ అనే మోసగాళ్లతో సంతోషంగా గడిపారని కాంగ్రెస్ ఓవర్సీస్ తన ట్వీట్‌లో పేర్కొంది. నేరస్తులు భారతదేశాన్ని దోచుకొని నిర్భయంగా జీవితాన్ని ఎలా అనుభవిస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనమని నటుడు కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేశారు.