Loading...
Jammu and Kashmir: భద్రతాబలగాల కాల్పుల్లో లష్కరే కమాండర్‌ యాసిర్‌ మృతి
భద్రతాబలగాల కాల్పుల్లో లష్కరే కమాండర్‌ యాసిర్‌ మృతి

Jammu and Kashmir: భద్రతాబలగాల కాల్పుల్లో లష్కరే కమాండర్‌ యాసిర్‌ మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 05, 2026
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబాకు చెందిన కమాండర్‌ను జమ్ముకశ్మీర్‌లో భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. కొంతకాలంగా ఉగ్రవాది యాసిర్‌ కదలికలపై నిఘా ఉంచిన భద్రతా బలగాలు.. శుక్రవారం యూస్‌మార్గ్‌లో అతడిని గుర్తించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో యాసిర్‌ హతమైనట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం యూస్‌మార్గ్‌లోని పర్వత ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సమయంలో ఓ ఉగ్రవాది బలగాలపై కాల్పులు జరిపాడు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఆ ఉగ్రవాది మరణించాడు. మృతుడిని యాసిర్‌గా గుర్తించినట్లు కశ్మీర్‌ పోలీసులు శనివారం వెల్లడించారు.

వివరాలు

ఉగ్రవాదులతో యాసిర్‌కు సంబంధాలు 

యాసిర్‌ గతంలో లష్కరే తయ్యిబాకు చెందిన ఓ ఉగ్రవాదుల బృందంలో సభ్యుడిగా ఉండేవాడు. అయితే ఏడాది క్రితం ఆ ముఠా నుంచి విడిపోయి.. స్వతంత్రంగా ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురు లష్కరే ఉగ్రవాదులతో యాసిర్‌కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.

ఆ సమయంలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఉగ్రవాదుల ఫొటోలో యాసిర్‌ కూడా ఉండటం గమనార్హం.

దీంతో భద్రతా బలగాలు కొంతకాలంగా అతడి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. యాసిర్‌కు పలు ఉగ్రదాడులతో సంబంధం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

వివరాలు

అతడి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ

2024 మేలో పూంఛ్‌లో భారత వైమానిక దళం (IAF) కాన్వాయ్‌పై జరిగిన దాడి, అదే ఏడాది అక్టోబర్‌లో సోనామార్గ్‌ సమీపంలో కార్మికులపై జరిగిన దాడి, 2024 డిసెంబర్‌లో బోటా పత్రిలో సైన్యంపై జరిగిన దాడి వంటి ఘటనల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.

పూంఛ్‌ నుంచి యూస్‌మార్గ్‌ మీదుగా పుల్వామాలోని పఖేర్‌పోరా వైపు ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు సైనికాధికారులు వెల్లడించారు.

ఉగ్రవాదుల కోసం వారం రోజులుగా భద్రతా బలగాలు మాటువేసి ఉన్నట్లు తెలిపారు. యాసిర్‌తో పాటు మరికొందరు ఉగ్రవాదులు కూడా అక్కడ ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

మిగతా ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు కొనసాగిస్తున్నాయని సైనికాధికారులు వెల్లడించారు.

ADVERTISEMENT