Loading...
Andhra Pradesh: 2025 నాటి ఓటర్ల జాబితాతోనే స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ కీలక నిర్ణయం
2025 నాటి ఓటర్ల జాబితాతోనే స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ కీలక నిర్ణయం

Andhra Pradesh: 2025 నాటి ఓటర్ల జాబితాతోనే స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 16, 2026
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) తుది ఓటర్ల జాబితాల ఆధారంగా కాకుండా.. 2025లో రూపొందించిన ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్‌ఎస్‌ఆర్‌) ఓటర్ల జాబితాలతో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. 'సర్‌' తుది ఓటర్ల జాబితాలను అక్టోబరు 3న ప్రచురించనున్నారు. వాటిని ఆధారంగా తీసుకుని స్థానిక సంస్థలకు కొత్తగా ఓటర్ల జాబితాలు రూపొందించి ప్రచురిస్తే ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం భావించింది. దీంతో 2025 నాటి ఎస్‌ఎస్‌ఆర్‌ జాబితాలనే ప్రామాణికంగా తీసుకునేందుకు అనుమతించింది. ఈ మేరకు పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఫొటో గుర్తింపు కలిగిన ఓటర్ల జాబితాల ప్రచురణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

వివరాలు

బీసీ రిజర్వేషన్లపై త్వరలో నిర్ణయం

అక్టోబరులోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తోంది.

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన డెడికేటెడ్‌ కమిషన్‌ శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

ఈ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే ఎన్నికలు దగ్గరపడినట్లేనని అధికారులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాల ప్రచురణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాల ప్రచురణను వచ్చే నెల 3లోగా పూర్తి చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలను సూచించింది.

వివరాలు

పోలింగ్‌ కేంద్రాలపైనా ఏర్పాట్లు

ఇప్పటివరకు ఓటర్ల జాబితాలు సిద్ధం కాని సుమారు 50 పంచాయతీల్లో ఈ నెల 17లోగా ప్రక్రియను పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ శాఖను ఆదేశించింది.

పంచాయతీల్లో పోలింగ్‌ కేంద్రాల ఎంపికతోపాటు వాటికి సంబంధించిన ప్రచురణ ప్రక్రియను ఈ నెల 21 నుంచి 31లోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం సూచించింది.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన అదనపు బ్యాలెట్‌ బాక్సుల కోసం ఇతర రాష్ట్రాలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఇప్పటికే లేఖలు పంపారు.

ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఇతర అవసరమైన ఏర్పాట్లను 30 నుంచి 45 రోజుల్లో పూర్తి చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ రూపొందిస్తోంది.

ADVERTISEMENT