Andhra pradesh: ఏపీలో పెట్టుబడులకు దిగ్గజ కంపెనీలకు లోకేశ్ ఆహ్వానం.. మూడు సంస్థలతో కీలక భేటీలు
ఈ వార్తాకథనం ఏంటి
వైద్య పరికరాలు, ఫార్మా, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్ దిల్లీలో అబాట్, సిస్కో, వివో సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో కొత్త తయారీ కేంద్రాలు, ఇంజినీరింగ్ సెంటర్లు, కాంపొనెంట్స్ పార్కుల ఏర్పాటుపై ప్రతిపాదనలు చేశారు.
వివరాలు
అబాట్‌కు మంత్రి లోకేశ్ ఆహ్వానం
అమెరికాకు చెందిన వైద్య పరికరాలు, పోషకాహార ఉత్పత్తుల సంస్థ అబాట్ మేనేజింగ్ డైరెక్టర్ ఇస్తేయాక్ అంజాద్‌తో మంత్రి నారా లోకేశ్ దిల్లీలో సమావేశమయ్యారు.
రాష్ట్రంలో వైద్య పరికరాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
నక్కపల్లిలో ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్క్‌లో జెనరిక్ ఔషధాల తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని ప్రతిపాదించారు.
బల్క్ డ్రగ్ పార్క్‌లో అనుకూలమైన భూమితో పాటు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, అవసరమైన వినియోగ సేవలు అందుబాటులో ఉంటాయని లోకేశ్ వివరించారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన విధానపరమైన ప్రోత్సాహకాలు, మద్దతు కూడా ఉంటాయని తెలిపారు.
విశాఖపట్నంలో అబాట్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు.
వివరాలు
400కు పైగా ఫార్మా బ్రాండ్లు, 12 వేల మందికి పైగా ఉద్యోగులు
భారత్‌లో తమ సంస్థకు 400కు పైగా ఫార్మా బ్రాండ్లు, 12 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారని అబాట్ ఎండీ అంజాద్ తెలిపారు.
గోవా, బద్ది (హిమాచల్‌ప్రదేశ్), ఝగాడియా (గుజరాత్)లో తయారీ కేంద్రాలు, ముంబయి, న్యూదిల్లీలో కార్యాలయాలు ఉన్నాయని చెప్పారు.
పోషకాహారం, ఫార్మా ఉత్పత్తుల విభాగాల్లో స్థానికంగా పేరున్న తయారీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉందన్నారు.
ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు.
వివరాలు
సిస్కోకు తయారీ కేంద్రం ప్రతిపాదన
సిస్కో సిస్టమ్స్ (అమెరికా) ఇండియా, దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ కృష్ణన్‌తోనూ మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు.
నెట్‌వర్కింగ్,సెక్యూరిటీ,కొలాబరేషన్,ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ప్రముఖ సంస్థగా ఉన్న సిస్కోకు ఏపీలో పెట్టుబడుల అవకాశాలను వివరించారు.
రాష్ట్రంలో డేటా సెంటర్ ఎకోసిస్టమ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారీ ఉత్పత్తి ద్వారా ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ప్రయోజనాలను సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ చెప్పారు.
డేటా సెంటర్ వాల్యూ చైన్‌కు సంబంధించిన మొత్తం వ్యవస్థను రాష్ట్రంలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఏపీలో యూనిఫైడ్ కంప్యూటింగ్ సిస్టమ్ (UCS) సర్వర్లు,స్విచ్‌లు,రౌటర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సిస్కోను కోరారు.
వివరాలు
ఏపీలో 50 వేల మంది యువతకు శిక్షణ
విశాఖపట్నంలో ఇంజినీరింగ్ సెంటర్ లేదా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
ఏపీలో 50 వేల మంది యువతను నెట్‌అకాడ్ యాక్సెస్, ఐటీ, ఇతర పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన శ్రామిక శక్తిగా తీర్చిదిద్దేందుకు గతేడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని సిస్కో ఇండియా ఎండీ హరీష్ కృష్ణన్ తెలిపారు.
ఈ కార్యక్రమం ఇప్పటికే అమలులో ఉందని చెప్పారు. విశాఖపట్నంలోని ఇన్నోవేషన్ సెంటర్, తిరుపతిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE), విజయవాడ స్మార్ట్ సిటీ, 22,500 కిలోమీటర్ల మేర విస్తరించిన ఏపీ ఫైబర్‌నెట్ ప్రాజెక్టుల్లో సిస్కో భాగస్వామిగా ఉందని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు.
వివరాలు
వివో కోసం కాంపొనెంట్స్ పార్క్ ప్రతిపాదన
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో ఇండియా ప్రెసిడెంట్ (గవర్నమెంట్ ఎఫైర్స్ & స్ట్రాటజిక్ ఎంగేజ్‌మెంట్) అర్జిత్ సేన్‌తో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు.
ఎలక్ట్రానిక్స్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతిలో వివో మొబైల్ కాంపొనెంట్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు.
వివో సరఫరాదారుల కోసం ప్రత్యేకంగా కాంపొనెంట్స్ తయారీ పార్క్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.
వివో, దాని అనుబంధ సంస్థల ప్రతినిధులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 'సప్లై చైన్ సమావేశం' నిర్వహించాలని లోకేశ్ సూచించారు.
వివరాలు
154.2 మిలియన్ యూనిట్ల వార్షిక ఉత్పత్తి
వివో మొబైల్ ఇండియా ఏటా 154.2 మిలియన్ యూనిట్ల మొబైళ్లను తయారు చేస్తూ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉందని అర్జిత్ సేన్ తెలిపారు.
దేశంలో విక్రయించే వివో ఫోన్లలో 99 శాతానికి పైగా గ్రేటర్ నోయిడాలోనే తయారవుతున్నాయని చెప్పారు.
వీటిలో మదర్‌బోర్డులు, 90 శాతానికి పైగా బ్యాటరీలు, ఛార్జర్ల తయారీ కూడా అక్కడే జరుగుతోందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చిస్తామని అర్జిత్ సేన్ తెలిపారు.