Lokesh: ఏపీలో గృహోపకరణాల తయారీ యూనిట్‌కు కుకూను ఆహ్వానించిన లోకేశ్
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేశ్ దక్షిణకొరియా పర్యటనను కొనసాగిస్తున్నారు. పర్యటనలో ఆరో రోజు గృహోపకరణాలు, నీటి శుద్ధి, గాలి శుద్ధి పరికరాల తయారీలో ప్రముఖ సంస్థ అయిన కుకూ (Cuckoo) ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అవకాశాలను మంత్రి లోకేశ్ వివరించారు. ముఖ్యంగా శ్రీసిటీలో ఇప్పటికే గృహోపకరణాల తయారీకి ప్రత్యేక క్లస్టర్ అభివృద్ధి చెందిందని తెలిపారు. అక్కడ అంబర్, ఈప్యాక్ డ్యూరబుల్, డైకిన్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రముఖ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు.
వివరాలు
ఎగుమతి చేయడానికి అనుకూలమైన వసతులు
దేశంలో తయారయ్యే ఎయిర్‌కండీషనర్లలో సుమారు 40 శాతం, టెలివిజన్లలో 35 శాతం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని లోకేశ్ వెల్లడించారు. ఈ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్ట్రంలో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అనుకూలమైన వసతులు ఉన్నాయని చెప్పారు. అలాగే దక్షిణ భారతదేశంలో ఎయిర్‌కండీషనర్ల వినియోగం అధికంగా ఉండటం కూడా పెట్టుబడిదారులకు అదనపు అవకాశమని వివరించారు. ప్రపంచ తయారీ రంగంలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందని, ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శ్రీసిటీ లేదా తిరుపతిలో గృహోపకరణాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కుకూ సంస్థ ప్రతినిధులను మంత్రి కోరారు.
వివరాలు
మంత్రి ప్రతిపాదనపై స్పందించిన కుకూ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులు
మంత్రి ప్రతిపాదనపై స్పందించిన కుకూ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. దక్షిణకొరియా పర్యటనలో భాగంగా ఆటోమోటివ్ పవర్ ఎలక్ట్రానిక్స్, పాసివ్ కాంపొనెంట్ల తయారీలో ఉన్న ప్రముఖ సంస్థ మోటివ్‌లింక్ (MOTIVELINK) సీఈవో కిమ్ కి-హాన్, ఇంటర్నేషనల్ సేల్స్ అండ్ రీసెర్చ్ జనరల్ మేనేజర్ బైద్య శర్మతో కూడా మంత్రి లోకేశ్ సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు.