Nara Lokesh: విశాఖలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ యూనిట్‌కు లోకేశ్ ఆహ్వానం.. రష్యా సంస్థకు పెట్టుబడి ప్రతిపాదనలు
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ బుధవారం ఎలిమెంట్ గ్రూప్ అధ్యక్షుడు ఖజోవ్ ఒలెగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, రోబోటిక్స్, స్మార్ట్ సిటీ మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. విశాఖపట్నంలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఎలిమెంట్ గ్రూప్ ప్రతినిధులకు సూచించారు. భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ రవాణా, బ్యాంకింగ్ కార్డ్ వ్యవస్థలకు అవసరమైన సురక్షిత ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు, స్మార్ట్ కార్డ్ మైక్రోచిప్‌ల తయారీకి విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు.
వివరాలు
నెల్లూరులో సిలికాన్ కార్బైడ్, పవర్ సెమీకండక్టర్ పరికరాల తయారీ కేంద్రం
ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ రంగాల్లో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, భాగస్వామ్య సంస్థలతో కలిసి నెల్లూరులో సిలికాన్ కార్బైడ్, పవర్ సెమీకండక్టర్ పరికరాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ యూనిట్ దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడంతో పాటు భవిష్యత్ పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే శ్రీసిటిలో ఉన్న ప్రముఖ తయారీ సంస్థలకు సమీపంగా సర్వో మోటార్లు, ఇండస్ట్రియల్ మోటార్ల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆ ప్రాంతంలో రోబోటిక్స్ సేవలను అందించేలా ఎలిమెంట్ గ్రూప్ రోబోటిక్స్, ఆటోమేషన్ విభాగాన్ని నెలకొల్పాలని సూచించారు.
వివరాలు
స్మార్ట్ సిటీ హార్డ్‌వేర్, ఐఓటీ మౌలిక సదుపాయాల సమీకరణ కీలం : లోకేశ్
అదేవిధంగా కమ్యూనికేషన్, నావిగేషన్, ఏరోస్పేస్, ఆన్‌బోర్డ్ టెలిమెట్రీ వ్యవస్థలకు అవసరమైన మాడ్యులర్ కాంపోనెంట్ల రూపకల్పనపై దృష్టి సారిస్తూ విశాఖ హైటెక్ కారిడార్‌లో మైక్రో ఎలక్ట్రానిక్స్ డిజైన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అమరావతి స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా స్మార్ట్ సిటీ హార్డ్‌వేర్, ఐఓటీ మౌలిక సదుపాయాల సమీకరణ కీలకమని లోకేశ్ పేర్కొన్నారు. రాజధాని నిర్మాణ అవసరాలకు అనుగుణంగా స్థానికంగా తయారయ్యే మైక్రో కంట్రోలర్లు, డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరికరాలు, హార్డ్‌వేర్ సరఫరా చేసే అవకాశాలను ఎలిమెంట్ గ్రూప్ పరిశీలించాలని సూచించారు.
వివరాలు
మాస్కో రవాణా వ్యవస్థపై ప్రశంసలు
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రజా రవాణా వ్యవస్థల్లో మాస్కో అడ్వాన్స్‌డ్ ట్రాన్స్‌పోర్ట్ సెంటర్ ఒకటిగా నిలిచిందని లోకేశ్ పేర్కొన్నారు. రవాణా నెట్‌వర్క్ నిర్వహణ, డిజిటలైజేషన్, ప్రయాణికుల సేవల కోసం అక్కడ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మాస్కోలో మెట్రో రైళ్లు, బస్సులు, ట్రాలీలు, ఎలక్ట్రిక్ రైళ్లు, బైక్ షేరింగ్, స్కూటర్ సేవలు అన్నీ ఒకే సమగ్ర వ్యవస్థ కింద పనిచేస్తున్నాయని వివరించారు. ప్రయాణికులు ఒకే మొబైల్ యాప్ ద్వారా అన్ని సేవలను సులభంగా వినియోగించుకునే అవకాశం కల్పించారని తెలిపారు.
వివరాలు
మాస్కో రవాణా వ్యవస్థపై ప్రశంసలు
నగర శివారు ప్రాంతాలను ప్రధాన కేంద్రాలతో అనుసంధానించే మాస్కో సెంట్రల్ డయామీటర్స్ రైలు ప్రాజెక్టు కూడా ఈ వ్యవస్థలో కీలక భాగమని చెప్పారు. అలాగే కృత్రిమ మేధస్సు (ఏఐ), సీసీ కెమెరాల సహాయంతో నగర ట్రాఫిక్, భద్రత అంశాలను మాస్కో అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్, ట్రాన్స్‌పోర్ట్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ కేంద్రాలు పర్యవేక్షిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఆధునిక ప్రజా రవాణా, భద్రతా వ్యవస్థలు భారత్‌లోనూ అమలులోకి రావాలని ఆకాంక్షించారు.