Loading...
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో రెండు రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో రెండు రోజులు భారీ వర్షాలు

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో రెండు రోజులు భారీ వర్షాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2026
08:19 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో శుక్ర,శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ), వాతావరణ శాఖ తెలిపాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడగా.. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉత్తర బంగాళాఖాతంలో గురువారం తెల్లవారుజామున ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా సుమారు 9.4 కిలోమీటర్ల ఎత్తు వరకు సైక్లోనిక్ సర్క్యులేషన్ విస్తరించి ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వాతావరణ వ్యవస్థ క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం వైపు కదులుతోందని ఐఎండీ వివరించింది.

వివరాలు 

ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు

ఈ అల్పపీడన ప్రభావంతో శుక్ర, శనివారాల్లో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

వివరాలు 

మత్స్యకారులకు కీలక హెచ్చరిక

అల్పపీడనం ప్రభావంతో ఏపీ తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని, అప్పుడప్పుడు గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకునే అవకాశం ఉందని తెలిపారు.

సముద్రం అల్లకల్లోలంగా మారడంతో పాటు అలలు ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రానున్న 48 గంటలపాటు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని ఏపీఎస్‌డీఎంఏ సూచించింది.

ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు ఆలస్యం చేయకుండా వెంటనే తీరానికి తిరిగి రావాలని స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

ఇప్పటికే కనిపిస్తున్న అల్పపీడన ప్రభావం

అల్పపీడనం ప్రభావం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కనిపిస్తోంది.

గురువారం అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

దార్లపూడిలో 3.7 సెంటీమీటర్లు, పరవాడలో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మరోవైపు వర్షాల సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

వర్షం కురుస్తున్న సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కిందకు వెళ్లవద్దని హెచ్చరించారు.

వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ఏపీఎస్‌డీఎంఏ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.

ADVERTISEMENT