Rain Alert: నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధిక వర్షపాతం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలంలోని ఎల్కపల్లి గ్రామంలో 4.1 సెంటీమీటర్లుగా నమోదైంది. అదే జిల్లాలోని సిర్పూర్ (టి), వాంకిడి ప్రాంతాల్లో చెరో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని చాప్రాల గ్రామంలో 3.5 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా కేంద్రంలో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
వివరాలు
వాతావరణ శాఖ హెచ్చరిక..
ఇక ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతానికి సమీపంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన బలమైన అల్పపీడనం ప్రస్తుతం కొనసాగుతున్నందున రాష్ట్రంలో వర్షాలు కురిసే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.