Loading...
Andhra Pradesh: మరింత బలపడనున్న అల్పపీడనం.. ఏపీలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం
మరింత బలపడనున్న అల్పపీడనం

Andhra Pradesh: మరింత బలపడనున్న అల్పపీడనం.. ఏపీలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2026
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

వాయవ్య బంగాళాఖాతం,దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండగా,ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి కొనసాగుతోంది. ఈ అల్పపీడనం వచ్చే రెండు రోజుల్లో మరింత బలపడి ఉత్తర ఒడిశా,పశ్చిమ బెంగాల్ వైపు వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మరోవైపు జమ్మూ,షాజహాన్‌పుర్,పట్నా మీదుగా వాయవ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన రుతుపవన ద్రోణి ప్రస్తుతం ఉత్తర ఒడిశా,పశ్చిమ బెంగాల్ తీరంలోని అల్పపీడన కేంద్రం గుండా తూర్పు బంగాళాఖాతంపై కొనసాగుతోంది.

వివరాలు 

వాయవ్య దిశ నుంచి గాలులు

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో వాయవ్య దిశ నుంచి గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు ఉత్తర కోస్తా,దక్షిణ కోస్తా, రాయలసీమతో పాటు యానాంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

అలాగే వేడి,తేమ అధికంగా ఉండే పరిస్థితులు కూడా నెలకొనవచ్చని పేర్కొంది.

అల్పపీడన ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా ఈశాన్య, తూర్పు భారత రాష్ట్రాలపై కూడా కనిపించనుంది.

వివరాలు 

దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు

రానున్న ఏడు రోజుల పాటు ఆ ప్రాంతాల్లో వర్షపాతం పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముండగా, ముఖ్యంగా జులై 16, 17 తేదీల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని హెచ్చరించింది.

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో చురుకుగా లేకపోవడంతో దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు నమోదైంది.

దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సాధారణంతో పోలిస్తే వర్షాలు తగ్గాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

గత వారం నమోదుకావాల్సిన సగటు వర్షపాతంతో పోలిస్తే -39 శాతం నుంచి -14 శాతం వరకు లోటు నమోదైనట్లు తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

రాబోయే రోజుల్లో మరో రెండు అల్పపీడనాలు

వర్షాల కొరత కొనసాగితే భూగర్భ జలాల మట్టాలు మరింత తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఏర్పడుతున్న వాతావరణ మార్పులు రుతుపవనాలకు మళ్లీ బలం చేకూర్చే అవకాశాలు ఉన్నాయని వారు భావిస్తున్నారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ, సముద్ర అధ్యయన శాస్త్ర విభాగాధిపతి సీవీ నాయుడు మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో ఈ సీజన్‌లో సాధారణంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదయ్యాయని తెలిపారు.

రాబోయే రోజుల్లో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడి విస్తృతంగా వర్షాలు కురిస్తే ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో గణనీయమైన మెరుగుదల కనిపించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT