LOADING...
LPG supply: పీఎన్‌జీకి మారకపోతే ఎల్‌పీజీ నిలిపివేత.. కేంద్రం కీలక నిర్ణయం
పీఎన్‌జీకి మారకపోతే ఎల్‌పీజీ నిలిపివేత.. కేంద్రం కీలక నిర్ణయం

LPG supply: పీఎన్‌జీకి మారకపోతే ఎల్‌పీజీ నిలిపివేత.. కేంద్రం కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 25, 2026
03:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఎల్‌పీజీ కొరత సమస్యను తగ్గించడంతో పాటు గ్యాస్ పంపిణీ వ్యవస్థను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైప్డ్ నాచురల్ గ్యాస్ (PNG) అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నివసించే వినియోగదారులు తప్పనిసరిగా ఆ కనెక్షన్‌కు మారాలని సూచించింది. ఒకవేళ మారకపోతే, మూడు నెలల తర్వాత ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఎల్‌పీజీ కొరత ఏర్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ మార్చి 24న నిత్యావసరాల చట్టం కింద జారీ చేసింది.

వివరాలు 

పీఎన్‌జీకి మారే వారికి ప్రోత్సాహకాలు

పీఎన్‌జీకి మారిన వినియోగదారులకు గ్యాస్ రీఫిల్ బుకింగ్ అవసరం ఉండదు. రోజంతా 24 గంటల పాటు నిరంతర గ్యాస్ సరఫరా లభిస్తుంది. ప్రస్తుతం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పీఎన్‌జీకి మారే వారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. అయితే సాంకేతిక కారణాల వల్ల ఇంటికి పైపులైన్ కనెక్షన్ ఇవ్వడం సాధ్యం కాకపోతే మాత్రమే ఎల్‌పీజీ సరఫరాను కొనసాగిస్తారు. ఆ సందర్భంలో కూడా పీఎన్‌జీ సరఫరా సంస్థ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (NOC) తప్పనిసరిగా పొందాలి.

వివరాలు 

పైపులైన్ అడ్డుకుంటే ఎల్‌పీజీ సరఫరా కట్ 

పైప్డ్ గ్యాస్ మౌలిక సదుపాయాల విస్తరణను వేగవంతం చేయడానికి కేంద్రం కొన్ని కీలక చర్యలు చేపట్టింది. గ్యాస్ పైపులైన్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులను అధికారులు నిర్ణీత గడువులో ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేయరాదని స్పష్టం చేసింది. హౌసింగ్ సొసైటీలు లేదా భూ యజమానులు పైపులైన్ వేయడాన్ని అడ్డుకోవద్దని హెచ్చరించింది. ఒకవేళ అడ్డుకుంటే, ఆ ప్రాంతానికి ఎల్‌పీజీ సరఫరాను నిలిపివేస్తామని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement