LPG pipeline network: ఎల్‌పీజీ సరఫరా ఇక మరింత సులభం.. 5 రాష్ట్రాల మీదుగా కొత్త పైప్‌లైన్
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ఎల్‌పీజీ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఎల్‌పీజీ పైప్‌లైన్ నెట్‌వర్క్ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. దాదాపు రూ.7 వేల కోట్ల వ్యయంతో 1,800 కిలోమీటర్ల మేర కొత్త పైప్‌లైన్లను నిర్మించనున్నారు. ఇందుకు పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (PNGRB) ఆమోదం తెలిపింది. గేల్ ఇండియా లిమిటెడ్ ఈ పైప్‌లైన్ల నిర్మాణ బాధ్యతలు చేపట్టనుంది.
వివరాలు
ఐదు రాష్ట్రాల మీదుగా పైప్‌లైన్
తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, గోవా రాష్ట్రాల మీదుగా ఈ పైప్‌లైన్ నెట్‌వర్క్ విస్తరించనుంది.
తెలంగాణలోని చర్లపల్లి నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పుర్ వరకు 556 కిలోమీటర్లు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్ వరకు 611 కిలోమీటర్లు
మహారాష్ట్రలోని షిక్రాపుర్ నుంచి గోవా, కర్ణాటకలోని హుబ్లీ వరకు 633 కిలోమీటర్లు
మొత్తంగా దాదాపు 1,800 కిలోమీటర్ల మేర కొత్త ఎల్‌పీజీ పైప్‌లైన్ నెట్‌వర్క్ అందుబాటులోకి రానుంది.
వివరాలు
9,500 కిలోమీటర్లకు ఎల్‌పీజీ పైప్‌లైన్ నెట్‌వర్క్
ప్రస్తుతం దేశంలో ఉన్న ఎల్‌పీజీ పైప్‌లైన్ నెట్‌వర్క్ 7,700 కిలోమీటర్లుగా ఉంది. కొత్త ప్రాజెక్టు పూర్తయితే ఇది 9,500 కిలోమీటర్లకు చేరుకోనుంది.
పైప్‌లైన్ ద్వారా ఎల్‌పీజీ సరఫరా పెరగడంతో రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గడంతో పాటు రోడ్లపై ట్యాంకర్ల రాకపోకలు, ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాల ముప్పు కూడా తగ్గుతుందని కేంద్రం తెలిపింది.