Loading...
Tomato: మదనపల్లె టమాటా రైతులకు చుక్కలు.. మార్కెట్‌లో కొనుగోలుదారులే కరువు
మదనపల్లె టమాటా రైతులకు చుక్కలు.. మార్కెట్‌లో కొనుగోలుదారులే కరువు

Tomato: మదనపల్లె టమాటా రైతులకు చుక్కలు.. మార్కెట్‌లో కొనుగోలుదారులే కరువు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2026
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

అప్పులు చేసి,పెట్టుబడులు పెట్టి,కుటుంబ సభ్యులంతా కష్టపడి పండించిన టమాటాలను మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతులకు తీవ్ర నిరాశ ఎదురైంది. మార్కెట్ యార్డులో తమ పంటకు వేలం నిర్వహించబోమని తెలియడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. కనీసం ఏదో ఒక ధరకు అయినా కొనుగోలు చేయాలని మండీ యజమానులను వేడుకున్నారు. దారి ఖర్చులైనా తిరిగి వస్తే సరిపోతుందనే ఆశతో ఎదురుచూసినా అది కూడా నెరవేరలేదు. చివరకు మార్కెట్ యాజమానికే తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి రావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె టమాటా మార్కెట్‌లో గురువారం చోటుచేసుకుంది. గురువారం మదనపల్లె టమాటా మార్కెట్‌కు మొత్తం 1,220 టన్నుల టమాటా దిగుబడి చేరింది.

వివరాలు 

మూడు రెట్లు పెరిగిన దిగుబడి

గత ఏడాది ఇదే నెలలో కేవలం 450 టన్నులు మాత్రమే మార్కెట్‌కు రాగా,ఈసారి దిగుబడి దాదాపు మూడు రెట్లు పెరిగింది.

అయితే ఉత్పత్తి పెరగడంతో పాటు మార్కెటింగ్‌లోనూ సమస్యలు తలెత్తాయి. సాధారణంగా మదనపల్లె నుంచి పలు ఉత్తరాది రాష్ట్రాలకు టమాటాలు ఎగుమతి అవుతుంటాయి.

అయితే ప్రస్తుతం ఆ రాష్ట్రాలకు ఎగుమతులు జరగకపోవడం రైతులకు ప్రతికూలంగా మారింది.

వివరాలు 

15 కిలోల క్రేట్‌ను రూ.30 నుంచి రూ.50 వరకు కొనుగోలు

మరోవైపు కర్ణాటక,అనంతపురం ప్రాంతాల నుంచి కూడా భారీ స్థాయిలో టమాటా దిగుబడి మార్కెట్‌కు చేరుతుండటంతో పోటీ పెరిగి, స్థానిక రైతుల పంటకు డిమాండ్ తగ్గిపోయింది.

ఈ పరిస్థితుల్లో గురువారం 15 మంది రైతులకు చెందిన టమాటా పంట పూర్తిగా అమ్ముడుపోలేదు.

రైతుల దయనీయ పరిస్థితిని గమనించిన మండీ యజమానులు చివరకు 15 కిలోల క్రేట్‌ను రూ.30 నుంచి రూ.50 వరకు కొనుగోలు చేశారు.

దీంతో టమాటాకు కిలోకు కేవలం రూ.2 నుంచి రూ.3.20 మాత్రమే ధర లభించింది.

ఉత్పత్తి ఖర్చులు కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొనడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.

ADVERTISEMENT