Loading...
Madhu Yaskhi: కాంగ్రెస్‌లో మధు యాష్కీకి కీలక బాధ్యతలు.. ఏఐపీసీ చీఫ్‌గా నియామకం
కాంగ్రెస్‌లో మధు యాష్కీకి కీలక బాధ్యతలు.. ఏఐపీసీ చీఫ్‌గా నియామకం

Madhu Yaskhi: కాంగ్రెస్‌లో మధు యాష్కీకి కీలక బాధ్యతలు.. ఏఐపీసీ చీఫ్‌గా నియామకం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2026
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు గౌడ్ యాష్కీకి పార్టీ అధిష్ఠానం కీలకమైన జాతీయ బాధ్యతలు అప్పగించింది. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) కొత్త ఛైర్మన్‌గా ఆయనను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. ఈ నియామకానికి సంబంధించిన వివరాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ బుధవారం అధికారికంగా వెల్లడించారు. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న ప్రవీణ్ చక్రవర్తి అందించిన సేవలను పార్టీ ఈ సందర్భంగా అభినందించింది.

వివరాలు 

తెలంగాణ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా పనిచేసిన యాష్కీ

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా మధు యాష్కీ కీలకంగా వ్యవహరించారు.

అయితే, ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన విజయం సాధించలేకపోయారు.

ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటికీ.. కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్న నేతగా యాష్కీకి గుర్తింపు ఉంది.

ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ జాతీయ స్థాయిలో కీలక పదవి ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు మధు గౌడ్ యాష్కీ ఎంపీగా విజయం సాధించారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ఆయన బలమైన మద్దతు ప్రకటించారు.

పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతల్లోనూ పనిచేశారు.

వివరాలు 

ఇటీవలి ఎన్నికల్లో ఓటమి తర్వాత జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ చీఫ్ విప్‌గా సేవలందించారు.

అయితే 2014,2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆయనకు విజయం దక్కలేదు.

ఆ తర్వాత 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమి ఎదురైంది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీపీసీసీ అధ్యక్ష పదవి ఖాళీ అయింది.

ఆ సమయంలో కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చ జరిగినప్పుడు మధు యాష్కీ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది.

అయితే కాంగ్రెస్ అధిష్ఠానం చివరకు ఆ బాధ్యతలను మహేశ్ కుమార్ గౌడ్‌కు అప్పగించింది.

తాజాగా మధు యాష్కీకి ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఛైర్మన్ పదవి దక్కడంతో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT