Loading...
TTD: టీటీడీ చరిత్రాత్మక నిర్ణయం .. శ్రీవారి భక్తులకురూ.2 లక్షల బీమా
టీటీడీ చరిత్రాత్మక నిర్ణయం .. శ్రీవారి భక్తులకురూ.2 లక్షల బీమా

TTD: టీటీడీ చరిత్రాత్మక నిర్ణయం .. శ్రీవారి భక్తులకురూ.2 లక్షల బీమా

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2026
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంక్షేమం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రమాదవశాత్తు మరణాలకు మాత్రమే అందుబాటులో ఉన్న బీమా రక్షణను ఇకపై సహజ మరణాలకూ వర్తింపజేయనుంది. దేశంలో మరెక్కడా లేని విధంగా తిరుమలలో సహజ మరణానికి రూ.2లక్షల బీమా ప్రయోజనం అందించే పథకానికి తితిదే పాలకమండలి ఆమోదం తెలిపింది. ఈ బీమా రక్షణ అలిపిరి టోల్‌ప్లాజా నుంచి భక్తులు తిరుమల కొండపైకి చేరినప్పటి నుంచి స్వామివారి దర్శనం పూర్తిచేసుకుని తిరిగి అలిపిరి చేరే వరకు కొనసాగుతుంది. ఇందుకోసం తితిదే భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)తో ఒప్పందం చేసుకుంది. ఎలాంటి లాభాపేక్ష, సర్వీస్‌ ఛార్జీలు ఆశించకుండా ఎల్‌ఐసీ ఈ పథకాన్ని అమలు చేయనుంది.

వివరాలు 

ఈ పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈ గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ పథకం నిర్వహణ కోసం తితిదే రూ.2.12 కోట్లను రివాల్వింగ్‌ ఫండ్‌గా కేటాయించింది.

ఒకవేళ క్లెయిమ్‌లు తక్కువగా ఉండి నిధులు మిగిలితే వాటిని తదుపరి నెలకు కొనసాగిస్తారు.

అవసరమైన సందర్భంలో అదనపు నిధులను కూడా సమకూర్చేలా ఏర్పాట్లు చేశారు.

ఈ నెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరి ఈ వివరాలను వెల్లడించారు.

వివరాలు 

టికెట్‌ ఉన్నా.. లేకున్నా బీమా

ముందుగానే దర్శన టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులతో పాటు టికెట్‌ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చే భక్తులకూ ఈ బీమా రక్షణ వర్తిస్తుంది.

దర్శన టికెట్లు ఉన్న భక్తుల వివరాలు నేరుగా ఎల్‌ఐసీ డేటాబేస్‌లో నమోదవుతాయి.

టికెట్‌ లేని భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించిన వెంటనే తిరుమలలోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఉన్న సాంకేతిక వ్యవస్థ ద్వారా వారిని గుర్తిస్తారు.

అనంతరం వారిని కూడా బీమా పరిధిలోకి తీసుకొస్తారు. భక్తులతో పాటు తిరుమలలో సేవలందించే శ్రీవారి సేవకులకూ ఈ బీమా సౌకర్యం వర్తించనుంది.

ADVERTISEMENT

వివరాలు 

వీరికి బీమా వర్తించదు

తితిదే ఉద్యోగులు, తిరుమల స్థానికులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, రవాణాదారులకు ఈ పథకం వర్తించదు.

ఆత్మహత్యలను కూడా బీమా కవరేజీ నుంచి మినహాయించారు.

బీమా కవరేజీ ప్రారంభమైన తొలి రోజును 'లీన్‌ పీరియడ్‌'గా పరిగణిస్తారు.

ఆ ఒక్కరోజు ప్రమాదవశాత్తు సంభవించే మరణాలకు మాత్రమే బీమా వర్తిస్తుంది.

ఆ తర్వాత నుంచి సహజ మరణాలకు కూడా పూర్తిస్థాయిలో రూ.2 లక్షల పరిహారం అందేలా నిబంధనలు రూపొందించారు.

ADVERTISEMENT

వివరాలు 

క్లెయిమ్‌ ప్రక్రియ మరింత సులభతరం

భక్తుల కుటుంబ సభ్యులు బీమా కోసం ఇబ్బందులు పడకుండా తితిదే క్లెయిమ్‌ ప్రక్రియను సులభతరం చేసింది.

తిరుమల కొండపై ఏదైనా భక్తుడు మరణిస్తే.. తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి చెందిన ప్రత్యేక వైద్య కమిటీ ముందుగా ఆ మరణాన్ని ధ్రువీకరిస్తుంది.

ఆ తర్వాత మృతుడి ఆధార్‌ వివరాలు, ఇతర అవసరమైన సమాచారాన్ని సేకరించి తితిదే అధికారులే ఎల్‌ఐసీ ప్రత్యేక పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా క్లెయిమ్‌ను నమోదు చేస్తారు.

ఎల్‌ఐసీ నుంచి క్లెయిమ్‌కు ఆమోదం లభించిన వెంటనే బీమా మొత్తాన్ని నేరుగా బాధిత కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.

వివరాలు 

ప్రమాద మరణ బీమా రూ.10 లక్షలకు పెంపు

ప్రమాదవశాత్తు మరణించే భక్తులు, ఉద్యోగులకు ప్రస్తుతం అందుతున్న రూ.3 లక్షల బీమా పరిహారాన్ని తితిదే పెంచింది.

ఇకపై ఈ మొత్తం రూ.10 లక్షలకు చేరనుంది. దీంతో ప్రమాద మరణాలకు సంబంధించిన బీమా రక్షణ కూడా మరింత బలోపేతం కానుంది.

వివరాలు 

బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నామని తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు.

బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

బుధవారం స్థానిక అన్నమయ్య భవనంలో తితిదే పాలకమండలి సమావేశం జరిగింది.

ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బోర్డు సభ్యులు హాజరయ్యారు.

పలు అంశాలపై చర్చించి కీలక తీర్మానాలు చేశారు.

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఈ నెల 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

వివరాలు 

సీఎం చంద్రబాబు పట్టువస్త్రాల సమర్పణ

అక్టోబర్‌ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వివరించారు.

ఈ నెల 14న సాయంత్రం 7 గంటలకు అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. 15న సాయంత్రం మీనలగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

అనంతరం రాత్రి 9గంటలకు జరిగే పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు.

అదే సమయంలో రిలయన్స్‌ సంస్థ తితిదేకు విరాళంగా అందించిన 25ఎలక్ట్రిక్‌ బస్సులను ఈ నెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.

ఇదే కార్యక్రమంలో 2027 సంవత్సరానికి సంబంధించిన తితిదే క్యాలెండర్లు, డైరీలను కూడా ఆవిష్కరించనున్నారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా తితిదే రూపొందించిన ప్రత్యేక బుక్‌లెట్‌ను ఇప్పటికే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర, బోర్డు సభ్యులు ఆవిష్కరించారు.

ADVERTISEMENT