Maharashtra CEO: ఈసీ వివాదం.. ఈఆర్వోలకు మరింత అధికారం కోరిన మహారాష్ట్ర సీఈవో
ఈ వార్తాకథనం ఏంటి
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో మహారాష్ట్ర నుంచి కీలక ప్రతిపాదన వచ్చింది. ఓటర్ల వివరాల్లో సాఫ్ట్‌వేర్ గుర్తించే చిన్నపాటి వ్యత్యాసాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం క్షేత్రస్థాయి ఎన్నికల అధికారులకు మరింతగా ఇవ్వాలని మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) ఎస్. చోక్కలింగం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
వివరాలు
ఈసీఐనెట్‌లో నాలుగు మార్పులు చేయాలని ప్రతిపాదన
ఈ మేరకు ఈసీఐనెట్ సాఫ్ట్‌వేర్‌లో నాలుగు మార్పులు చేయాలని ఆయన సూచించారు.
ముఖ్యంగా 'లాజికల్ డిస్క్రెపెన్సీ'గా గుర్తించిన కేసుల్లో.. ఓటరు సమర్పించిన పత్రాలను పరిశీలించిన అనంతరం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) సంతృప్తి చెందితే, ఆ కేసును స్వయంగా పరిష్కరించే అవకాశం కల్పించాలని కోరారు.
అలాగే అవసరమైన ఆధారాలు అందుబాటులో ఉన్నప్పుడు సంబంధిత ఓటరును వ్యక్తిగత విచారణకు పిలవకుండా మినహాయించే ఆప్షన్ కూడా ఉండాలని సూచించారు.
ప్రస్తుతం కొన్ని సందర్భాల్లో ఈఆర్వో వద్ద తగిన ఆధారాలు ఉన్నప్పటికీ.. ఈసీఐనెట్ సాఫ్ట్‌వేర్‌లోని పరిమితుల కారణంగా కేసును ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
ఇదే అంశం.. ఈసీ వివాదానికి కేంద్రబిందువు
మహారాష్ట్ర సీఈవో తాజాగా లేవనెత్తిన అంశం ఇక్కడే కీలకంగా మారింది.
ఈఆర్వోల అధికారాలు, ఈసీఐనెట్‌లో వారికి ఉన్న యాక్సెస్‌పై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గతంలో పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఓటర్ల జాబితా తయారీ, పేర్లను చేర్చడం, తొలగించడం, అభ్యంతరాలపై నిర్ణయం తీసుకోవడం వంటి బాధ్యతలు చట్టపరంగా ఈఆర్వోలకే ఉన్నాయి.
అయితే సాఫ్ట్‌వేర్‌లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి లేదా అవసరమైన మార్పులు చేయడానికి కావాల్సిన యాక్సెస్ కేంద్రీకృత నియంత్రణలో ఉండటంపై వారు ప్రశ్నలు లేవనెత్తారు.
వివరాలు
అసలు ఈసీఐనెట్ ఏం చేస్తోంది?
SIRలో ప్రస్తుత ఓటరు వివరాలను గత SIRలో నమోదైన తల్లిదండ్రులు,తాతముత్తాతల వివరాలతో ఈసీఐనెట్ సాఫ్ట్‌వేర్ సరిపోల్చుతుంది.
పేరు, వయసు వంటి వివరాల్లో తేడా కనిపిస్తే దాన్ని'లాజికల్ డిస్క్రెపెన్సీ'గా గుర్తిస్తుంది.
అయితే ఇలా మిస్‌మ్యాచ్ రావడం అంటే ఆ వ్యక్తి ఓటరు కాదని తేల్చినట్లు కాదు.
కేవలం పాత రికార్డుల్లోని వివరాలతో ప్రస్తుత వివరాలు సరిపోలలేదని మాత్రమే అర్థం.
ఇక్కడే ఈఆర్వోల పాత్ర కీలకంగా ఉంటుంది. ఓటరు సమర్పించిన పత్రాలను పరిశీలించి, అవసరమైతే విచారణ జరిపి.. ఆ వ్యక్తి పేరు ఓటర్ల జాబితాలో కొనసాగించాలా? తొలగించాలా? అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది ఈఆర్వోలే.
అయితే ఆ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అవసరమైన ఆప్షన్లు,యాక్సెస్ కూడా సాఫ్ట్‌వేర్‌లో ఉండాలని మహారాష్ట్ర సీఈవో తాజా ప్రతిపాదనలో కోరుతున్నారు.
వివరాలు
అందుకే 'ఫ్రీ హ్యాండ్' కోరుతున్నారు
మహారాష్ట్ర సీఈవో ప్రతిపాదన వెనుక ఉన్న ప్రధాన అంశం ఇదే. సాఫ్ట్‌వేర్ ఒక వ్యత్యాసాన్ని గుర్తించడం ఒక విషయం.
ఆ వ్యత్యాసంపై ఓటరు ఇచ్చిన వివరణ, సమర్పించిన పత్రాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవడం మరో విషయం.
ఈ రెండో అంశంలో ఈఆర్వోలకు మరింత వెసులుబాటు ఉండాలని ఆయన కోరుతున్నారు.
ఇదే అంశంపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కూడా గతంలో ఈఆర్వోలకున్న చట్టపరమైన అధికారాలను సాఫ్ట్‌వేర్ పరిమితం చేయకూడదని అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
దీంతో మహారాష్ట్ర సీఈవో తాజాగా చేసిన ప్రతిపాదనతో ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది.
వివరాలు
ఇప్పటికే కొన్ని మార్పులు
ఈ వివాదం నేపథ్యంలో సెప్టెంబర్ 26న ఈసీఐనెట్‌పై సమీక్ష నిర్వహించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
అలాగే SIR నోటీసులు అందుకున్నవారి విషయంలో విధానాన్ని కూడా సులభతరం చేసింది.
అవసరమైన పత్రాలను బూత్ లెవల్ అధికారులు (BLOలు) ఓటర్ల ఇళ్ల వద్దే సేకరించి ఈసీఐనెట్‌లో అప్‌లోడ్ చేయవచ్చని ఈసీ తెలిపింది.
సంతృప్తికరమైన పత్రాలు అందుబాటులో ఉంటే ఈఆర్వో వ్యక్తిగత విచారణ నుంచి ఓటరును మినహాయించవచ్చని స్పష్టం చేసింది.
క్షేత్రస్థాయి అధికారులకు మరింత వెసులుబాటు అవసరమైతే అందుకు అనుగుణంగా మార్పులు చేస్తామని కూడా ఈసీ పేర్కొంది.
వివరాలు
ఇప్పటికే కొన్ని మార్పులు
అందుకే మహారాష్ట్ర సీఈవో లేవనెత్తిన డిమాండ్ ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.
SIRలో సాఫ్ట్‌వేర్ గుర్తించే మిస్‌మ్యాచ్ ఒక అంశమైతే.. దానిపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఈఆర్వోది.
ఆ నిర్ణయం తీసుకునేందుకు ఈఆర్వోకు ఈసీఐనెట్‌లో ఎంత మేర స్వేచ్ఛ ఉండాలి? అనేదే ప్రస్తుతం మొత్తం వివాదంలో కీలక ప్రశ్నగా మారింది.