Malaysia Travel Alert: మలేషియాకు వీసా ఫ్రీ ప్రయాణం.. భారతీయులకు హైకమిషన్ కీలక సూచనలు
ఈ వార్తాకథనం ఏంటి
మలేషియా పర్యటనకు వెళ్లే భారతీయ ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ సూచించింది. భారత పాస్‌పోర్ట్‌దారులకు అందుబాటులో ఉన్న 30 రోజుల వీసా రహిత ప్రయాణ సదుపాయాన్ని ఉపాధి కోసం ఉపయోగించుకోవద్దని స్పష్టం చేసింది. నకిలీ ఉద్యోగాల పేరుతో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. నకిలీ జాబ్ ఆఫర్లతో మోసాలు మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు ఏజెంట్లు నిరుద్యోగులకు నకిలీ హామీలు ఇస్తున్నారని హైకమిషన్ తెలిపింది. ఉద్యోగం కోసం వెళ్లే వారికి వీసా ఫ్రీ ట్రావెల్‌ను ఉపయోగించుకోవచ్చని చెప్పి కొందరు మోసం చేస్తున్నట్లు పేర్కొంది. ఇలాంటి ఏజెంట్ల మాటలు నమ్మి మలేసియాకు వెళ్లిన పలువురు భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించింది.
వివరాలు
గడువు దాటితే చట్టపరమైన చర్యలు
పర్యాటకం లేదా వీసా రహిత ప్రయాణం పేరుతో మలేసియాకు వెళ్లి, అనుమతించిన గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉంటున్న భారతీయుల సంఖ్యపై హైకమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఇలా నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉండటంతో సంబంధిత వ్యక్తులు మలేసియా చట్టాల ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
పర్యాటకం, సామాజిక సందర్శనలకే వీసా ఫ్రీ ప్రవేశం
భారత పాస్‌పోర్ట్ కలిగిన వారికి మలేసియా అందిస్తున్న 30 రోజుల వీసా రహిత ప్రవేశం కేవలం పర్యాటకం, సామాజిక సందర్శనల కోసం మాత్రమేనని హైకమిషన్ స్పష్టం చేసింది.
ఈ సదుపాయాన్ని ఉద్యోగం లేదా ఇతర ఉపాధి అవకాశాల కోసం ఉపయోగించుకోవడం మలేసియా వలస నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.
వివరాలు
వర్క్ పర్మిట్ తప్పనిసరి
మలేసియాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులు తప్పనిసరిగా సరైన వర్క్ పర్మిట్ పొందాలని హైకమిషన్ సూచించింది.
వర్క్ పర్మిట్ లేకుండా ఉద్యోగం కోసం మలేసియాకు రావద్దని హెచ్చరించింది.
వీసా ఫ్రీ ట్రావెల్ ఉందనే కారణంతో అక్కడ ఉద్యోగం చేసేందుకు అనుమతి లభించినట్లు భావించకూడదని తెలిపింది.
ప్రయాణానికి ముందే ఏర్పాట్లు చేసుకోవాలి
పర్యాటక అవసరాల కోసం మలేసియాకు వెళ్లే సాధారణ ప్రయాణికులు ముందుగానే తగిన ట్రావెల్ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని హైకమిషన్ సూచించింది.
ముఖ్యంగా రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్ వంటి వివరాలు సిద్ధంగా ఉంచుకోవడం ద్వారా ఇమ్మిగ్రేషన్ సమయంలో అనవసర ఇబ్బందులు తగ్గుతాయని తెలిపింది.
వివరాలు
పాస్‌పోర్ట్ వ్యాలిడిటీపై జాగ్రత్త
మలేసియాకు వెళ్లే సమయంలో పాస్‌పోర్ట్ కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటులో ఉండేలా చూసుకోవాలని భారత హైకమిషన్ సూచించింది.
ప్రయాణానికి ముందు పాస్‌పోర్ట్ వ్యాలిడిటీతో పాటు అవసరమైన ప్రయాణ పత్రాలు, బుకింగ్ వివరాలను కూడా సరిచూసుకోవాలని పేర్కొంది.
ఈ ఏడాది చివరి వరకు వీసా ఫ్రీ సదుపాయం
భారత పౌరులకు మలేసియా 30 రోజుల వీసా రహిత ప్రయాణ సదుపాయాన్ని ఈ ఏడాది చివరి వరకు అందిస్తోంది.
ఈ వెసులుబాటును కేవలం నిర్దేశించిన ప్రయోజనాలకే ఉపయోగించుకోవాలని హైకమిషన్ స్పష్టం చేసింది.
ఉద్యోగాల పేరుతో మోసపోకుండా, మలేసియా వలస నిబంధనలను పాటిస్తూ ప్రయాణించాలని భారతీయులకు సూచించింది.