TMC: మమతా బెనర్జీకి షాక్.. టీఎంసీని వీడిన సీనియర్ ఎంపీ సుఖేందు రాయ్
ఈ వార్తాకథనం ఏంటి
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ తన సభ్యత్వానికి రాజీనామా చేస్తూ టీఎంసీతో తన రాజకీయ బంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవలే పార్టీ అసెంబ్లీ సభ్యుల్లో మొదలైన తిరుగుబాటు పార్లమెంట్ వరకు విస్తరించే అవకాశం ఉందంటూ ఆయన పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టీఎంసీలో అంతర్గత విభేదాలు పెరుగుతున్న తరుణంలో ఆయన పార్టీని వీడటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. టీఎంసీలో అత్యంత వాక్చాతుర్యం కలిగిన సీనియర్ నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన సుఖేందు శేఖర్ రాయ్, పార్టీని వీడుతున్నట్లు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు.
వివరాలు
భారతీయ జనతా పార్టీపై సుఖేందు ప్రశంసలు
ఆ లేఖలో రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, మహిళలపై అణచివేత అధికమైందని ఆరోపించారు. అలాగే విద్య, ఆరోగ్య సంరక్షణ, పరిశ్రమలు, ఉపాధి, శాంతిభద్రతలు వంటి కీలక రంగాల్లో తీవ్ర అరాచక పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను ప్రజలు తిరస్కరించారని కూడా తన లేఖలో ప్రస్తావించారు. మరోవైపు భారతీయ జనతా పార్టీపై సుఖేందు ప్రశంసలు కురిపించారు. బెంగాల్ చరిత్రలో తొలిసారిగా ఓటర్లు ఆ పార్టీకి భారీ విజయాన్ని అందించారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని కొనియాడారు.
వివరాలు
బెంగాల్ లో వేడెక్కిన రాజకీయం
ఇప్పటికే పార్టీ రెబల్ నేత రితబ్రతకు సుమారు 61 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా స్పీకర్ ఆయనను నియమించారు. అసమ్మతి ఎమ్మెల్యేలతో టీఎంసీ ఎంపీలు కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్న వేళ సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా, మరో టీఎంసీ ఎంపీ కోయల్ మల్లిక్ కూడా తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో జరగనున్న ఇండియా కూటమి కీలక సమావేశంలో పాల్గొనేందుకు మమతా బెనర్జీ దేశ రాజధానికి వెళ్లిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషంగా మారింది.