
Video: ఉగ్రవాదులకు సహాయం.. తప్పించుకునే క్రమంలో నదిలో దూకిన వ్యక్తి.. వీడియో రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు సహాయం చేసిన ఆరోపణలపై భద్రతా బలగాల అదుపులో ఉన్న ఓ వ్యక్తి, తప్పించుకునే ప్రయత్నంలో నదిలో దూకడంతో ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనకు భద్రతా బలగాలే కారణమని ఆరోపణలు వచ్చినప్పటికీ, తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో అతను స్వయంగా నదిలోకి దూకినట్లు స్పష్టమవుతోంది.దీంతో భద్రతా బలగాల తప్పులేదని తేలిపోయింది.
కుల్గాం జిల్లాలో ఇటీవల ఉగ్రవాదులకు సహకరించినట్టు సమాచారం అందడంతో, స్థానికంగా నివసిస్తున్న 23 ఏళ్ల ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే అనే వ్యక్తిని శనివారం రోజున పోలీసులు అరెస్టు చేశారు.
విచారణలో టాంగ్‌మార్గ్ ప్రాంతంలోని అడవుల్లో దాగి ఉన్న ఉగ్రవాదులకు తాను ఆహారం,ఆశ్రయం, ఇతర సహాయం అందించినట్టు అతను ఒప్పుకున్నాడు.
వివరాలు
ఉగ్రవాదులను బయటకు రప్పించేందుకు సహకరిస్తానని హామీ
అంతేగాక, ఉగ్రవాదులను బయటకు రప్పించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చాడు.
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పోలీసులు,ఆర్మీ జవాన్లు అతని సహాయంతో ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నంలో అడవిలోకి వెళ్లారు.
అయితే, ఈ చర్యల మధ్యలో ఇంతియాజ్ వేషా నది వద్దకు చేరుకొని అకస్మాత్తుగా అందులోకి దూకి పారిపోవాలని యత్నించాడు.
నదిలో నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటంతో అతను కొంత దూరం ఈదినప్పటికీ, తర్వాత ప్రవాహంలో చిక్కుకుని మునిగి మరణించాడు.
ఈ ఘటన అనంతరం స్థానికంగా తప్పుడు ప్రచారాలు ప్రారంభమయ్యాయి.
వివరాలు
తప్పుడు ప్రచారాన్ని ఖండించిన భద్రతా బలగాలు
పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (PDP) అధినేత్రి, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి ఇలా మృతిచెందడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఆమె ఈ మరణం వెనక కుట్రకోణం ఉన్నదని ఆరోపించారు. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో, ఇంతియాజ్ ఏవరి ఒత్తిడీ లేకుండానే స్వయంగా నదిలోకి దూకిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది.
మొదట అతను ఈతకొడుతూ వెళ్లినప్పటికీ, ప్రవాహానికి లోనై కొంతదూరం వెళ్లిన తర్వాత నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
ఈ మొత్తం దృశ్యం కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియోతో తప్పుడు ప్రచారాన్ని భద్రతా బలగాలు ఖండించాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఉగ్రవాదులకు సహాయం.. నదిలోకి దూకిన వ్యక్తి..
ఉగ్రవాదులకు సహాయం.. నదిలోకి దూకిన వ్యక్తి..
— ChotaNews App (@ChotaNewsApp) May 5, 2025
కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులకు సహాయం చేసిన ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే (23)ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. విచారణలో అతను టాంగ్‌మార్గ్ అడవిలో ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం అందించినట్లు అంగీకరించాడు. ఆదివారం వేషా నదిలో దూకి తప్పించుకునేందుకు… pic.twitter.com/jR2bwdjJ6t