Rohan Parikh: కాబోయే భార్యను ఇంప్రెస్ చేయాలని ఏఐతో నకిలీ పీఎంవో కార్డు.. చివరికి అరెస్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
కాబోయే భార్య, అత్తమామల ముందు తనకు ఉన్న'పవర్'ను చూపించాలనుకున్న ఓ యువకుడు ఏఐ సాయంతో నకిలీ గుర్తింపు కార్డు తయారు చేసి, తుపాకీతో వీవీఐపీ మార్గంలో ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు నిర్వహించిన భద్రతా తనిఖీల్లో పోలీసులకు చిక్కాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు విచారణలో వెలుగులోకి వచ్చాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న జియో వరల్డ్ ప్లాజాలో సోమవారం పోలీసులు 24 ఏళ్ల రోహన్ పారిఖ్, అతని అంగరక్షకుడు దిలీప్ కుండేలను అరెస్ట్ చేశారు. వారి వద్ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ (PMO)కు చెందినదిగా కనిపించే నకిలీ ఐడీ కార్డుతో పాటు తుపాకీ ఉన్నట్లు గుర్తించారు.
వివరాలు
భార్యను, అత్తమామలను నమ్మించేందుకు..
నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న రోహన్ పారిఖ్.. తాను కేంద్ర ప్రభుత్వంలో అత్యంత ప్రభావవంతమైన అధికారినని, ప్రధాని కార్యాలయంతో నేరుగా సంబంధాలు ఉన్నాయని కాబోయే భార్య, ఆమె కుటుంబ సభ్యులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
తాను చెప్పిన విషయాలను నిజమని నమ్మించేందుకు ఓ పథకం రూపొందించాడు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ హాజరుకానున్న ఎన్‌ఎంఏసీసీ వేదికను ఎంచుకున్నాడు.
వివరాలు
ఏఐతో నకిలీ ఐడీ.. రెండుసార్లు రెక్కీ
రోహన్ ఏఐ టూల్స్ సాయంతో నిజమైన పీఎంఓ గుర్తింపు కార్డును పోలిన డిజిటల్ ఐడీ కార్డును తయారు చేసినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ కార్డును 2025లోనే రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు.
ఆ నకిలీ కార్డును ఉపయోగించి వీవీఐపీ ప్రవేశ మార్గం ద్వారా జియో వరల్డ్ ప్లాజాలోకి వెళ్లి తనకు ఉన్న అధికార పరిచయాలను చూపించాలనేది అతని ప్లాన్.
ఈ పథకాన్ని అమలు చేసేందుకు రోహన్ ఇప్పటికే రెండుసార్లు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే ప్రధాని పర్యటనకు ముందు భద్రతా ఏర్పాట్లలో భాగంగా చేపట్టిన విస్తృత తనిఖీల సమయంలో అతని ప్రయత్నం విఫలమైంది.
నకిలీ ఐడీ కార్డు, తుపాకీతో అతడు పోలీసులకు పట్టుబడ్డాడు.
వివరాలు
ముగ్గురి అరెస్ట్.. మరో వ్యక్తి కోసం గాలింపు
ఈ కేసులో రోహన్ పారిఖ్, అతని బాడీగార్డ్, డ్రైవర్‌లను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
రోహన్ ఆఫీస్ అసిస్టెంట్ ప్రథమేష్ బాగుల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నిందితులపై మోసం, ఫోర్జరీ, వీవీఐపీ భద్రతా నిబంధనల ఉల్లంఘన తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.