Manipur: ఈ ఏడాదంతా దురదృష్టకరంగా గడిచింది.. ప్రజలను క్షమాపణలు కోరిన మణిపుర్ సీఎం..
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్లో జాతుల మధ్య చెలరేగిన వైరంతో అల్లకల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి.
రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థతులపై ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ మరోసారి స్పందించారు.
ఈ ఏడాది మొత్తం రాష్ట్ర ప్రజలకు కష్టకాలమని, అందుకు క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు.
''ఈ ఏడాది చాలా కష్టసమయంగా గడిచింది. చాలామంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు, మరికొందరు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.ఈ పరిస్థితిపై చింతిస్తున్నాను.. గత మే నెల నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై ప్రజలకు క్షమాపణలు కోరుతున్నాను'' అని సీఎం మీడియా ఎదుట పేర్కొన్నారు.
వివరాలు
త్వరలో గృహా నిర్మాణాలను ప్రారంభిస్తాం
''రాష్ట్రంలో 12,000కు పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 625 మంది నిందితులను అరెస్ట్ చేయగా, 5,600 ఆయుధాలు, 35,000 మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత మూడు, నాలుగు నెలలుగా శాంతి స్థితిని చూస్తున్నాం. మణిపుర్ క్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తగిన భద్రతా సిబ్బందిని పంపింది. నిర్వాసితుల కోసం నిధులను కేటాయించింది. త్వరలో గృహా నిర్మాణాలను ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది నుంచి శాంతి స్థాపన సాధ్యమవుతుందని నమ్ముతున్నాను'' అని అన్నారు.
వివరాలు
కుకీ, మైతేయి తెగల మధ్య ఘర్షణలు
సీఎం బీరేన్ సింగ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ''రాష్ట్రంలోని అన్ని కమ్యూనిటీ ప్రజలు ఇప్పటివరకు జరిగిన తప్పిదాలను క్షమించి, చేదు జ్ఞాపకాలను మరిచి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. మణిపుర్ అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలి'' అని అన్నారు.
గత మే నెలలో కుకీ, మైతేయి తెగల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని 225 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలతో బాధితులు ఇప్పటికీ సహాయ కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ సందర్భంలోనే ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.